Share News

అత్యవసర వైద్య సేవలపై శిక్షణ

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:58 PM

జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రబలే సీజనల్‌ వ్యాధులు, మాతాశిశు మరణాల నివారణ, అత్యవసర వైద్య సేవలపై పీహెచ్‌సీ వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

అత్యవసర వైద్య సేవలపై శిక్షణ
పీహెచ్‌సీ వైద్యాధికారుల శిక్షణ కార్యక్రమంలో సూచనలు ఇస్తున్న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌

పీహెచ్‌సీ వైద్యాధికారులకు ప్రత్యేక అవగాహన

పాడేరురూరల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రబలే సీజనల్‌ వ్యాధులు, మాతాశిశు మరణాల నివారణ, అత్యవసర వైద్య సేవలపై పీహెచ్‌సీ వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీల వైద్యాధికారులకు హైబ్రీడ్‌ మోడ్‌లో మూడు రోజుల ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్‌ తెలిపారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్త్రీ శిక్షణ కేంద్రంలో శిక్షణ ప్రారంభించామన్నారు. ఈ శిక్షణను ఐటీడీఏ, జిల్లా ఆరోగ్య యంత్రాంగం సంయుక్తంగా ప్రత్యేక, ఆన్‌లైన్‌ (హైబ్రీడ్‌ మోడ్‌)ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా గర్భిణుల ఆరోగ్యం, క్షేత్ర స్థాయిలో వైద్యాధికారుల పాత్ర, బాధ్యతలు, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం, 12 రకాల సేవల ప్యాకేజీలు, ఆశా కార్యకర్తల పాత్ర, నవజాత శిశువుల సంరక్షణ, మలేరియా, డెంగ్యూ వ్యాధుల కట్టడి, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు, తదితర అంశాలపై ప్రభుత్వ వైద్య కళాశాల ప్రత్యేక వైద్య నిపుణులతో శిక్షణ అందిస్తున్నామన్నారు. పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల విధులకు అంతరాయం కలగకుండా ఈ శిక్షణలో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో టీఎన్‌ ప్రతాప్‌, జిల్లా కార్యక్రమ పర్యవేక్షణాధికారి ఎం.కిరణ్‌కుమార్‌, స్త్రీ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ ఓ.శాంతి పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:58 PM