ఆస్తి పన్నుల్లో చేతివాటం
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:47 AM
గ్రామాల్లో ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేసి, పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించడానికి చేపట్టిన చర్యలకు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు తూట్లు పొడుస్తున్నారు.
వసూలు చేసిన డబ్బులను పక్కదారి పట్టిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో జమచేయని వైనం
భవన యజమానులకు నకిలీ రశీదులు
అచ్యుతాపురం మండలంలోని పలు పంచాయతీల్లో బయటపడిన అక్రమాలు
సర్పంచులు నిలదీయంతో.. డబ్బులు జమ చేసిన కార్యదర్శులు
అచ్యుతాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
గ్రామాల్లో ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేసి, పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించడానికి చేపట్టిన చర్యలకు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు తూట్లు పొడుస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన వివిధ రకాల పన్నులకు సంబంధించిన సొమ్మును పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా నెలల తరబడి తమ ఆధీనంలో వుంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది కార్యదర్శులు పన్నుల సొమ్మును దిగమింగుతున్నారు. ఇటువంటి అక్రమాలు వీరు బదిలీ అయిన తరువాత బయటపడుతున్నాయి. ఈ తరహా సంఘటనలు జిల్లాలోని పలు పంచాయతీల్లో చాపకింద నీరులా సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా అచ్యుతాపురం మండలంలోని రెండు పంచాయతీల్లో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బులను సంబంధిత కార్యదర్శులు పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయని విషయాన్ని సర్పంచులు గుర్తించారు.
గ్రామాల్లో నివాస గృహాలతోపాటు ప్రైవేటు విద్యా సంస్థలు, దుకాణాలు, ఇతర కట్టడాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఏటా ఆస్తి పన్ను, కొళాయి పన్ను వసూలు చేస్తుంటారు. నివాస, వాణిజ్య భవనాలనకు వేర్వేరుగా పన్నులు వుంటాయి. వసూలుచేసి పన్నుల డబ్బులకు సంబంధించి రశీదు పుస్తకంలో నమోదు చేసి, ఒక కాపీని భవన యజమానికి ఇచ్చేవారు. కొద్ది రోజుల తర్వాత ఈ సొమ్మును పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. అయితే ప్రభుత్వం పన్నుల వసూళ్లను కూడా డిజిటలైజేషన్ చేసింది. కార్యదర్శులు తమ వద్ద వుండే ఆండ్రాయిడ్ ఫోన్లు/ ట్యాబ్‌లు/ కంప్యూటర్‌లో ఆయా అసెస్‌మెంట్లు, వసూలైన పన్ను వివరాలను నమోదు చేసి, 24 గంటల్లోకి డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. కానీ పలువురు కార్యదర్శులు పాత విధానంలో రశీదులు జారీ చేస్తున్నారు. పైగా పన్ను డబ్బులను బ్యాంకు ఖాతాలో జమచేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు.
ఎలా బయటపడిందంటే..
అచ్యుతాపురం మండలంలోని ఒక పంచాయతీలో అపార్టుమెంట్ నుంచి పారిశుధ్య సిబ్బంది కొత్త రోజుల నుంచి చెత్త తీసుకెళ్లడంలేదు. దీంతో అపార్టుమెంట్ కమిటీ ప్రతినిధులు, పంచాయతీ సర్పంచ్‌కు ఫోన్ చేసి పారిశుధ్య సిబ్బంది చెత్త ఎందుకు తీసుకెళ్లడం లేదని అడిగారు. ‘మీ అపార్టుమెంట్ ఆస్తి పన్ను బకాయిలు రూ.70 వేలు వుందని, పన్ను చెల్లించే వరకు పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరించరు’ అని సర్పంచ్ బదులిచ్చారు. దీంతో కంగుతిన్న అపార్టుమెంట్ వాసులు.. రూ.70 వేల ఆస్తి పన్ను ఎప్పుడో చెల్లించామని చెప్పారు. దీంతో పంచాయతీ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. అపార్టుమెంట్ వాసులు చెల్లించిన ఆస్తి పనులు డబ్బులు జమ కాలేదు. ఇదే పంచాయతీలోని ఒక విద్యా సంస్థ యాజమాన్యం చెల్లించిన రూ.30 వేల ఆస్తి పన్ను కూడా ఖాతాలో జమకాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శిని పిలిచి ప్రశ్నించగా.. పొరపాటు జరిగిందని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళితే తన ఉద్యోగం పోతుందని, కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పారు. దీంతో ఒకింత మెత్తబడిన సర్పంచ్.. ఇంతవరకు వసూలు చేసిన ఆస్తి పన్ను డబ్బులను వెంటనే పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. దీంతో సదరు కార్యదర్శి రెండు రోజుల్లో రూ.5.7 లక్షలను బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిసింది.
మండలంలో మరో పంచాయతీ సర్పంచ్ ఆస్తి పన్నుల వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తారసపడి.. తనకు ఆస్తి పన్ను రెట్టింపు ఎందుకు విధించారని అడిగి, గతంలో కార్యదర్శి జారీ చేసిన డిమాండ్ నోటీసు చూపించారు. దీంతో సర్పంచ్ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించగా, గత సంవత్సరం ఇంటి పన్ను బకాయి వున్నట్టు కనిపించింది. కానీ గత సంవత్సరం తాను పన్నులు చెల్లించినట్టు ఇంటి యజమాని రశీదు చూపించాడు. దీంతో అప్పటి కార్యదర్శి డబ్బులు స్వాహా చేసినట్టు గుర్తించారు. కానీ ఆ కార్యదర్శి బదిలీపై మరో పంచాయతీకి వెళ్లిపోయారు.