Share News

ఎలక్ర్టానిక్స్‌ జోష్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:32 AM

దసరా పండుగ నేపథ్యంలో ఎలక్ర్టానిక్‌ వస్తువుల అమ్మకాలు పెరిగాయి.

ఎలక్ర్టానిక్స్‌ జోష్‌

  • జోరుగా పండుగ అమ్మకాలు

  • గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్టు చెబుతున్న వ్యాపారులు

  • ఏసీలు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్స్‌ అమ్మకాల్లో వృద్ధి

  • వినియోగదారులను షోరూమ్‌లు కళకళ

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

దసరా పండుగ నేపథ్యంలో ఎలక్ర్టానిక్‌ వస్తువుల అమ్మకాలు పెరిగాయి. వినియోగదారులతో షోరూమ్‌లు కళకళలాడుతున్నాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు సుమారు 15 నుంచి 20 శాతం మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి అమ్మకాల్లో పెరుగుదల కనిపించిందని, నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు, మూడు రెట్లు అధికంగా సాగుతున్నట్టు పేర్కొంటున్నారు. ఎక్కువగా ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు (స్మార్ట్‌ ఫోన్లు మినహా) 10 నుంచి 15 వరకు అమ్ముడైతే, దసరా పండగ నేపథ్యంలో 40 నుంచి 60 వరకు అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. వీటిలో ఏసీలు 20 శాతం ఉండగా, టీవీలు 10 నుంచి 15 శాతం, వాషింగ్‌ మెషీన్లు 10 నుంచి 12 శాతం, రిఫ్రిజిరేటర్స్‌ ఐదు నుంచి పది శాతం ఉంటున్నాయని చెబుతున్నారు. వీటితోపాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇయర్‌ బర్డ్స్‌, హోమ్‌ థియేటర్లు, మైక్రోఓవెన్‌లు, మిక్సర్లు, వాటర్‌ ఫ్యూరిఫైర్లు అమ్ముడవుతున్నాయి. ఆయా వస్తువులపై పది నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కొన్ని షోరూమ్‌ల యజమానులు చెబుతున్నారు.

తగ్గిన స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు

అయితే గడిచిన ఏడాదితో పోలిస్తే స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు సుమారు 20 నుంచి 30 శాతం మేర పడిపోయినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. కొద్దినెలలుగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో ఫోన్‌ల ధరలు భారీగా పెరిగాయి. కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని ఫోన్లు 40 నుంచి 80 శాతం మేర ధర పెరిగాయి. దీంతో అమ్మకాలపై ప్రభావం పడినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో డాబాగార్డెన్స్‌లోని ఒక సెల్‌ ఫోన్‌ దుకాణంలో 20 నుంచి 30 ఫోన్ల అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా వంటి పండగ సమయంలో ఈ సంఖ్య 60 నుంచి 80 వరకు ఉండేది. కానీ కొద్దిరోజులుగా రోజువారీ అమ్మకాలు 20 కూడా దాటడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.


నల్లజీడితో జాగ్రత్త

దసరా పూజల్లో వినియోగం

తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

శరీరానికి తగిలితే చికాకులు

శరీరం ఎర్రబారడం, వాపు, దురద, నీటి పొక్కులు, బొబ్బలు వచ్చే ప్రమాదం

ముఖం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రతించాలని సూచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దసరా సందర్భంగా వాహనాలు, యంత్రాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజల్లో వినియోగించే వస్తువుల్లో నల్లజీడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, నల్లజీడి (మార్కింగ్‌ నట్‌) వినియోగించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సెమెకార్పస్‌ అనాకార్డియం అనే శాస్ర్తీయ నామం కలిగిన ఈ మొక్క పండులోని నల్లటి రసంలో చర్మానికి చికాకు కలిగించే పదార్థాలు ఉంటాయంటున్నారు. వీటిని నేరుగా తాకడం వల్ల శరీరం ఎర్రబారడం, వాపు, దురద, నీటి పొక్కులు, బొబ్బలు ఏర్పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఇందులో గల బిలావనాల్‌ వంటి రసాయనాలు చర్మంపై చికాకు, అలర్జీ వంటి ప్రతి చర్యలకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి కొందరిలో కొన్ని గంటల్లోనే కనిపిస్తే, మరికొందరిలో ఒకటి, రెండు రోజుల తరువాత బయటపడతాయని పేర్కొంటున్నారు.

మచ్చలు.. వాపు వచ్చే ప్రమాదం..

నల్లజీడి రసం చర్మానికి అంటుకున్న ప్రాంతంలో ఎర్రటి మచ్చలు, వాపు, చిన్న పొక్కులు, పెద్ద బొబ్బలు ఏర్పడే అవకాశముంది. తీవ్రతను బట్టి ముఖం వాపు, అనంతరం నల్లటి మచ్చలు ఏర్పడతాయి. నల్లజీడి రసం చర్మానికి తగులకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున తగిలితే ఆ ప్రాంతాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేయాలని, కళ్లకు, ముఖానికి తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన మంట, బొబ్బలు, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రతించాలని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్‌ వెంకటాచలం పేర్కొన్నారు. ముఖ్యంగా కళ్లకు తగిలినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా అత్యవసర వైద్య సహాయం పొందాలని ఆయన సూచించారు.

Updated Date - Oct 19 , 2026 | 01:32 AM