విద్యాలయాలకు విద్యుత్ వెలుగులు
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:24 AM
ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గల ప్రాథమిక పాఠశాలలకు చీకట్లు తొలిగాయి. సుమారు యాభై ఏళ్లుగా విద్యుత్ సదుపాయానికి నోచుకోని పాఠశాలల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అల్లూరి జిల్లాలో 93 ప్రాథమిక పాఠశాలలకు విద్యుత్ సదుపాయం
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో పనులు
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు పాఠశాలల్లో వెలుగులు రావడంతో గిరిజనుల ఆనందం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గల ప్రాథమిక పాఠశాలలకు చీకట్లు తొలిగాయి. సుమారు యాభై ఏళ్లుగా విద్యుత్ సదుపాయానికి నోచుకోని పాఠశాలల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలకు విద్యుత్ సదుపాయం ఉండడం సహజం. అయితే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలకు సైతం విద్యుత్ సదుపాయం కల్పించడం విశేషం. విద్యాభివృద్ధిలో భాగంగా ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 93 ప్రాథమిక పాఠశాలలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. ఇందుకు గాను ఒక్కో పాఠశాలకు రూ. 1.5 లక్షలు ఖర్చు చేశారు.
ఐదు దశాబ్దాల చీకట్లు తొలిగాయి
ఏజెన్సీలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి సుమారుగా 50 ఏళ్లు కావస్తున్నది. అయితే అప్పటి నుంచి వాటికి ఎటువంటి విద్యుత్ సదుపాయం లేదు. దీంతో వాతావరణానికి అనుగుణంగా ఎండ కాస్తే గదుల్లో వెలుతురు, మబ్బులు పడితే చీకటి అన్నట్లుగానే ఉండేది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మారుమూలనున్న ప్రాథమిక పాఠశాలలకు సైతం విద్యుత్ సదుపాయం కల్పించడంపై ఆయా గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు తమ బడులకు వెలుగులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 93 విద్యాలయాలకు వెలుగులు
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంపిక చేసిన 93 ప్రాథమిక పాఠఽశాలలకు సమగ్ర శిక్ష అధికారులు విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. ఉమ్మడి జిల్లాలో అడ్డతీగలలో 9, అరకులోయలో 10, చింతపల్లిలో 15, దేవీపట్నంలో 1, డుంబ్రిగుడలో 4, జీకేవీధిలో 16, గంగవరంలో 1, కొయ్యూరులో 7, మారేడుమిల్లిలో 4, ముంచంగిపుట్టులో 4, పెదబయలులో 17, రంపచోడవరంలో 4, వై.రామవరంలో 1 చొప్పున మొత్తం 93 పాఠశాలలు విద్యుత్ సదుపాయానికి నోచుకున్నాయి.