ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్‌కు శ్రీకారం
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:47 AM
ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని, రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.
గాజువాక డిపోలో భూమి పూజ
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదు
రవాణాశాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
మల్కాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి):
ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని, రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. గాజువాక ఆర్టీసీ బస్సు డిపోలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్నారు. విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, వీటిలో 50 బస్సులు గాజువాక ఆర్టీసీ డిపోనకు కేటాయిస్తున్నామన్నారు. ఈ మేరకు పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. సంస్థకు కార్మికులు, ప్రయాణికులు ముఖ్యమని, త్వరలోనే సీఎన్‌జీ బస్సులు నడిపే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. త్వరలో 1,450 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. కాపు తుంగ్లాం నుంచి ఆర్‌కే బీచ్ వరకు నూతన బస్సును మంత్రి ప్రారంభించారు. ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, విజయనగరం జోన్ చైర్మన్ దొన్ను దొర, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఈడీ గీత, తదితరులు పాల్గొన్నారు.