ఎలక్ర్టిక్ బస్సుల ట్రయల్ రన్
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:17 AM
విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నడపనున్న 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 16 బస్సుల ట్రయల్ రన్ పూర్తయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రిక్ విభాగం అధికారులు, బస్సు బిల్డింగ్ నిపుణులు ట్రయల్‌రన్‌ను పర్యవేక్షించారన్నారు.
ఇప్పటివరకూ 16 రాక,
నేడో రేపో మరో నాలుగు నగరానికి చేరుకునే అవకాశం
15 నుంచి సేవలు ప్రారంభం
ద్వారకా బస్‌స్టేషన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నడపనున్న 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 16 బస్సుల ట్రయల్ రన్ పూర్తయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రిక్ విభాగం అధికారులు, బస్సు బిల్డింగ్ నిపుణులు ట్రయల్‌రన్‌ను పర్యవేక్షించారన్నారు. ఫుల్ చార్జింగ్ పెట్టి ఎంత సామర్థ్యంతో ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో పరిశీలించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, గాజువాక డిపో, ద్వారకా బస్‌స్టేషన్‌లలో చార్జింగ్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, విమానాలు దిగి నగరానికి వచ్చేవారు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఎలక్ర్టిక్ బస్సులను సిద్ధం చేశామని, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి 50 మంది డ్రైవర్లను, ఎక్కువ విద్యార్హత కలిగిన కండక్టర్లను ఎంపిక చేశామన్నారు. ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరు, మాట్లాడాల్సిన విధానం, బాడీ లాంగ్వేజీపై తర్ఫీదు ఇచ్చామమన్నారు. విమాన ప్రయాణికుల రవాణాకు వినియోగించే బస్సుల సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ అమలు చేస్తామన్నారు. ఈ 16 బస్సులు ఆగస్టు 15 నుంచి విమాన ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు అందించనున్నట్టు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. మరో నాలుగు బస్సులు మంగళవారం రానున్నాయని, వాటి రిజిస్ట్రేషన్, ట్రయల్‌రన్ పూర్తిచేసిన తరువాత ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామన్నారు.