భోగాపురానికి ఎలక్ర్టిక్ బస్సులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:08 AM
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకకృషి చేస్తోంది.
ఎయిర్‌పోర్టు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రణాళిక
విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా...
సింహపురిలో ప్రత్యేకంగా ఈ-బస్ కాంప్లెక్స్
గాజువాక, భోగాపురాల్లో చార్జింగ్ స్టేషన్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకకృషి చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించడంతో పాటు ఎలక్ర్టిక్ ఏసీ బస్సులను కూడా నడపాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. టాక్సీలకు వేల రూపాయలు చెల్లించే భారం తప్పుతుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూన్ లేదా జూలై నెలలో ప్రారంభం కానున్నదని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అక్కడకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రయాణికులను చేరవేసే మార్గాలపై అధికార వర్గాలు దృష్టి సారించాయి. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి భోగాపురం విమానాశ్రయం చేరుకోవడానికి వీఎంఆర్‌డీఏ ఏడు మాస్టర్ ప్లాన్ రహదారులను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి జూన్ నెలాఖరుకు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విమాన ప్రయాణికులకు ప్రత్యేకంగా ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి విమానాశ్రయానికి ఏసీ బస్సులు నడపాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం రెండు నెలల క్రితం విజ్ఞప్తి చేసింది. విశాఖ నుంచి టాక్సీల్లో వెళితే ప్రయాణ వ్యయం విమాన టిక్కెట్ల ధరతో సమానంగా ఉంటుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో పాటు, రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేశ్‌కుమార్‌లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించాలని కోరారు. ఇలా అనేక విజ్ఞప్తులు, సూచనలు రావడంతో దీనిపై ఆర్‌టీసీ అధికారులు దృష్టి సారించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలో వాహన కాలుష్యం తగ్గించడానికి ఎలక్ర్టిక్ బస్సులు (ఈ-బస్సులు) తీసుకువస్తోంది. వాటిని అన్ని రాష్ట్రాలకు ఇస్తామని ప్రకటించింది. ఆంద్రప్రదేశ్‌కు సుమారు 500 వరకు వచ్చే అవకాశం ఉంది. అందులో వంద బస్సులు విశాఖపట్నానికి కేటాయిస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇవి జూన్ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది. వాటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌టీసీ అధికారులకు ఆదేశించింది. దాంతో సింహాచలం సమీపాన సింహపురి కాలనీలో ఆర్టీసీ అధికారులు సంస్థకున్న నాలుగు ఎకరాల స్థలంలో ఈ-బస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వచ్చే బస్సుల్లో సగం అక్కడి నుంచే ఆపరేట్ చేయాలని నిర్ణయించారు. మరికొన్ని బస్సులకు గాజువాక డిపోలో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి నడపాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
జీఎంఆర్ కోరిక మేరకు...
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న జీఎంఆర్ గ్రూపు కూడా ఈ-బస్సులపై ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ పెద్దలతో చర్చించి విశాఖకు వచ్చే తొలి విడత బస్సులను విమానాశ్రయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నడపాలని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. భోగాపురంలో విమాన వేళల సమయాలు తీసుకొని, ఏయే ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికులు ఉంటారో అంచనా వేసి ఆయా ప్రాంతాల మీదుగా ఈ-బస్సులు నడపాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ బస్సులకు విమానాశ్రయంలోనే చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం కూడా కల్పిస్తామని జీఎంఆర్ ముందుకు వచ్చింది. దీంతో విమానాశ్రయం ప్రారంభం నాటికే ఈ-బస్సులను కూడా సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా
అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్, విశాఖపట్నం
విశాఖకు తొలి విడతతో 20 ఈ-బస్సులు వస్తాయి. వాటిని విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి నడుపుతాం. వాటికి పరిమిత సంఖ్యలో స్టాప్‌లు ఉంటాయి. ఇవన్నీ ఏసీ బస్పులు. ప్రత్యేక ధరలు ఉంటాయి. కేవలం విమాన ప్రయాణికులే కాకుండా ఆ మార్గంలో ఇతరులు కూడా ఎక్కే అవకాశం కల్పిస్తాం.