Share News

విశాఖ- చోడవరం రూట్‌లోఎలక్ట్రిక్‌ బస్సులు ?

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:35 AM

విశాఖ నగరం నుంచి చోడవరానికి త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

విశాఖ- చోడవరం రూట్‌లోఎలక్ట్రిక్‌ బస్సులు ?
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రదేశం ఇదే..

చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు

స్థల పరిశీలన చేసిన ఆర్టీసీ అధికారులు

చోడవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరం నుంచి చోడవరానికి త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులను ఆధునీకరించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే ప్రణాళికలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాకు కేటాయించిన ఎలక్ర్టిక్‌ బస్సులు విశాఖ నగరంతో పాటు, నగరం నుంచి గ్రామీణ ప్రాంతానికి నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. దీనిలో భాగంగానే విశాఖ నగరం నుంచి అల్లూరి ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉన్న చోడవరం మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి చోడవరం, మాడుగులకు 30 బస్సులు రోజుకు మూడు ట్రిప్పులు చొప్పున సుమారుగా 96 సర్వీసులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో చాలా వరకు పాత బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అఽఽధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఈవీ ఆర్టీసీ బస్సుల కోసం చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆనుకుని ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ నెలకొల్పనున్నారు. విశాఖ నగరం నుంచి వచ్చిన బస్సులు ఇక్కడ చార్జింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఈ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనకాపల్లి ఆర్టీసీ మేనేజర్‌ ప్రవీణతో పాటు చార్జింగ్‌ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఈపీడీసీఎల్‌ అధికారులు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గల స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఈవీ బస్సుల చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు అయిన వెంటనే విశాఖ- చోడవరం మధ్య ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Jul 19 , 2026 | 12:35 AM