నగరంలో రోడ్డెక్కిన ఎలక్ర్టిక్ బస్సులు
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:19 AM
నగరంలో ఎలక్ర్టిక్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
ఏసీ, విశాలమైన సీట్లు
స్ర్తీ శక్తి పథకం కూడా వర్తింపు
మల్కాపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఎలక్ర్టిక్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. వీటిని సోమవారం రవాణా శాఖా మంత్రి ఎం.రాజేంద్రప్రసాద్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా గాజువాక ఆర్టీసీ డిపోలో బస్సులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు పచ్చ జెండా ఊపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బస్సుల నిర్వహణ ఒకింత భారం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ సాధారణ బస్సులకు కనీస చార్జీ పది రూపాయలు ఉంటే ఎలక్ట్రిక్ బస్సుల్లో 15 రూపాయలు ఉంటుందన్నారు. స్త్రీ శక్తి పథకం కూడా వర్తిస్తుందన్నారు. గాజువాక ఆర్టీసీ డిపో పరిధిలో ఇప్పటికే 20 బస్సులు భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడుస్తున్నాయన్నారు. మరో 30 బస్సులు నగరంలోని వివిధ మార్గాల్లో తిరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు అధ్యక్షత వహించగా, ఏడీసీపీ అన్నెపు నరసింహమూర్తి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శ్రీనివాసరావు, గాజువాక ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశ్వరరావు, కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, ఆర్టీసీ విభాగం ప్రతినిధి ప్రసాదుల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏసీలో హాయిగా ప్రయాణం
గాజువాక ఆర్టీసీ డిపో నుంచి తొలిసారిగా సకల సౌకర్యాలు కలిగిన ఎలక్ట్రిక్ బస్సులు నగర రోడ్లపైకి వచ్చాయి. ఈ బస్పుల్లో ఏడు సీసీ కెమెరాలు ఉంటాయి. ఏసీ సౌకర్యంతో పాటు సీట్లు విశాలంగా ఉంటాయి. ఇవి ఆర్‌కే బీచ్, జగదాంబ, సింథియా, గాజువాక మధ్య, అలాగే సింథియా నుంచి గాజువాక, ఎన్‌ఏడీ మీదుగా పెందుర్తి వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్, సింథియా, గాజువాక, స్టీల్‌ప్లాంటు మధ్య తిరుగుతాయి.