Share News

‘భోగాపురం’లో ఎలక్ట్రిక్‌ బస్సుల టెర్మినల్‌ సిద్ధం

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:31 AM

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఎలక్ట్రిక్‌ బస్సుల టెర్మినల్‌ సిద్ధమయ్యింది.

‘భోగాపురం’లో ఎలక్ట్రిక్‌ బస్సుల టెర్మినల్‌ సిద్ధం

తుది దశకు చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు పనులు

ద్వారకా బస్‌స్టేషన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఎలక్ట్రిక్‌ బస్సుల టెర్మినల్‌ సిద్ధమయ్యింది. మొదటి దశలో నాలుగు బస్సులు ఒకేమారు నిలిపేందుకు వీలుగా టెర్మినల్‌ సిద్ధం చేశారు. ఇదే సామర్థ్యంతో మరో టెర్మినల్‌ నిర్మాణానికి పనులు శరవేగంతో సాగుతున్నాయి. వచ్చే నెల ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండడంతో కాస్త ముందుగానే ఎలక్ట్రిక్‌ బస్సుల ట్రయల్‌ రన్‌ వేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో పది ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చే అవకాశం ఉందని రీజియన్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ బస్సులతో ఇటు జాతీయ రహదారిలోను, అటు బీచ్‌రోడ్డులో ట్రయల్‌ రన్‌ వేస్తామని రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. ఇదే ఆవరణలో ఎలక్ట్రిక్‌బస్సుల చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఒకేమారు మూడు బస్సులు చార్జింగ్‌ చేసుకునేలా యూనిట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులు ఆపరేట్‌ చేస్తున్న తిరుపతి ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఒక బస్సుకు పూర్తిస్థాయిలో చార్జింగ్‌ చేసేందుకు గరిష్ఠంగా రెండు గంటల సమయం పడుతుందని రీజనల్‌ మేనేజర్‌ తెలిపారు. బస్సుల టెర్మినల్‌, చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు పనులను సోమవారం ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌, జీఎంఆర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు పరిశీలించారు.


నవంబరులో పెట్టుబడుల సదస్సు

12, 13 తేదీల్లో నిర్వహణ

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి మరింత పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం అధికారులను ఆదేశించారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నారు. దీనికి ముందు దేశ, విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. వివిధ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు.


ఎన్యుమరేషన్‌ పత్రాలు 95 శాతం పంపిణీ

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ (ఈఎఫ్‌) పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకూ 19,24,480 మంది (95.13 శాతం)కి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేస్తూ, వాటిని తిరిగి సేకరించే ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో 97.65 శాతం, గాజువాకలో 96.82 శాతం, విశాఖ నార్త్‌లో 95.94 శాతం, ‘సౌత్‌’లో 95.55 శాతం, తూర్పులో 93.93 శాతం, పశ్చిమలో 93.33 శాతం, భీమిలిలో 32.56 శాతం ఎన్యుమరేషన్‌ పత్రాల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 2,60,210 ఫారాల డిజిటలైజేషన్‌ చేశామన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 12.86 శాతమని తెలిపారు.

Updated Date - Jun 30 , 2026 | 01:31 AM