ఎన్నికల వేళ.. క్యాటరింగ్ కళకళ
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:33 AM
జీవీఎంసీ ఎన్నికలు అనేక హోటల్స్, క్యాటరింగ్ సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి.
నగరంలోని క్యాటరింగ్ సెంటర్లు, హోటల్స్‌కు భారీగా ఆర్డర్లు
ఉదయం, రాత్రి టిఫిన్లు, మధ్యాహ్నం
భోజనం/బిర్యానీ సరఫరాకు ఒప్పందాలు
రెండు రోజులకు ఒకసారి స్పెషల్ బిర్యానీ పెడుతున్న అభ్యర్థులు
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలు అనేక హోటల్స్, క్యాటరింగ్ సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా తమ వెంట వచ్చే కార్యకర్తలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా వార్డుల పరిధిలోని హోటల్స్, క్యాటరింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అవసరమైన ఆహార పదార్థాలను తయారుచేయించుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి కనీసం 50 నుంచి 200 మంది వరకు కార్యకర్తలకు టిఫిన్లు, భోజనాలు ఆర్డర్ ఇస్తున్నారు. ఈ మేరకు సుమారు 80 క్యాటరింగ్ సంస్థలు, మరో 80 హోటళ్లకు ఆర్డర్లు లభించినట్టు సమాచారం.
నగర పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఇలా ఆహారాన్ని సరఫరా చేసేందుకు వీలుగా మూడు రోజులు ముందు నుంచి ఒప్పందాలు చేసుకోగా, మరికొందరు ఆదివారం నుంచి ఏర్పాట్లు చేశారు. మద్దిలపాలెంలోని ప్రముఖ క్యాటరింగ్ సంస్థకు ప్రధాన పార్టీలకు చెందిన వివిధ వార్డుల్లో పోటీ పడుతున్న ఎనిమిది మంది అభ్యర్థులు ప్రతిరోజూ 450 మంది కార్యకర్తలకు భోజనాలు, టిఫిన్లు అందించే బాధ్యతను అప్పగించారు.
భారీగానే ఖర్చు..
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం/బిర్యానీ, రాత్రి మళ్లీ టిఫిన్/భోజనంతోపాటు మూడుసార్లు టీ అందించేలా ఏర్పా ట్లు చేసుకున్నారు. ఇందుకోసం ఒక్కో కార్యకర్తకు రూ.300 నుంచి రూ.350 వరకు చెల్లిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ కనీసంగా భోజనాల కోసం ఒక్కో అభ్యర్థి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ ఏర్పాట్లు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కొనసాగనున్నాయి.
మెనూ ఇలా..
అభ్యర్థులకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉండేలా అభ్యర్థులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ విభిన్న మెనూ ప్లాన్ చేస్తున్నారు. ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, గారె, పూరీ, (కొందరు చికెన్‌తో కూడిన టిఫిన్లు), పొంగలి వంటివి పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, రెండు కూరలు, అప్పడం, సాంబారు, పెరుగుతోపాటు ఒక స్వీట్ ఏర్పాటు చేస్తున్నారు. రోజు విడిచి రోజు తప్పనిసరిగా చికెన్ బిర్యానీ ఉండేలా చూసుకుంటున్నారు.
ముందుగా బుక్ చేసుకుంటేనే...
అభ్యర్థులు ముందుగా ఆయా క్యాటరింగ్ సంస్థలు, హోటల్స్‌తో మాట్లాడుకుని భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పందాలు పూర్తికావడంతో చాలా సంస్థలు ఇక తమవల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నాయి. దీంతో కొంత మంది అభ్యర్థులు తమ కార్యాలయాల వద్దే ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భోజనాలకు డిమాండ్ పెరగడంతో చిన్న హోటల్స్‌కు గిరాకీ పెరిగింది. రోజువారీ వ్యాపారం రూ.5 వేలు మించని హోటల్స్‌కు రూ.20 వేల వరకు పెరిగిందని చెబుతున్నారు. చిన్న టిఫిన్ సెంటర్లకు కూడా భారీగా ఆర్డర్లు వస్తుండడంతో వ్యాపారులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.