Share News

నేడు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:11 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక శుక్రవారం జరగనుంది. దీంతోపాటే వైస్‌చైర్మన్‌ పదవికి కూడా ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవంతో ఈ రెండు పదవులూ కూటమికే సొంతం కానున్నాయి. మొత్తం 24 జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది.

నేడు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు కేటాయింపు

పరవాడ జడ్పీటీసీ సభ్యురాలికి పాధాన్యం

టీడీపీకి వైస్‌ చైర్మన్‌పదవి

మునగపాక జడ్పీటీసీ పెంటకోట స్వాతి ఎంపిక

అనకాపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక శుక్రవారం జరగనుంది. దీంతోపాటే వైస్‌చైర్మన్‌ పదవికి కూడా ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవంతో ఈ రెండు పదవులూ కూటమికే సొంతం కానున్నాయి. మొత్తం 24 జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన బీసీ మహిళా జడ్పీటీసీలు ఈ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ తరపున నర్సీపట్నం, ఎస్‌.రాయవరం, అచ్యుతాపురం, రావికమతం, దేవరాపల్లి, మునగపాక, జనసేన పార్టీ తరపున బుచ్చెయ్యపేట, పరవాడ, సబ్బవరం మండలాల నుంచి బీసీ మహిళలు జడ్పీటీసీలు సభ్యులుగా ఎన్నికయ్యారు. జడ్పీ పదవులకు సంబంధించి కూటమిలో రాష్ట్రస్థాయిలో సర్దుబాటులో భాగంగా అనకాపల్లి జడ్పీ పదవిని జనసేనకు కేటాయించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి (జనసేన) పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి వుంది. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయిస్తే.. వైస్‌ చైర్మన్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. సామాజకవర్గాల సమీకరణలో భాగంగా ఈ పదవికి మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి పేరును టీడీపీ అధిష్ఠానం గురువారం రాత్రి ప్రకటించింది. కాగా జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. అనంతరం నూతన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

Updated Date - Nov 20 , 2026 | 01:11 AM