Share News

పల్లెల్లో ఎన్నికల సందడి

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:23 AM

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.

పల్లెల్లో ఎన్నికల సందడి

నాలుగు మండలాల్లో తొలిరోజు సర్పంచ్‌ పదవులకు 72, వార్డులకు 267 నామినేషన్లు

23 వరకు గడువు

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజైన శనివారం సర్పంచ్‌ పదవులకు 72, వార్డులకు 267 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆనందపురం మండలంలో సర్పంచ్‌ పదవులకు 29 మంది, వార్డులకు 87, భీమిలి మండలంలో సర్పంచులకు 11, వార్డులకు 62, పద్మనాభం మండలంలో సర్పంచులకు 20, వార్డులకు 78, పెందుర్తి మండలంలో సర్పంచ్‌ పదవులకు 12, వార్డులకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఆనందపురం మండలంలో 26 పంచాయలు ఉండగా...తొలిరోజు ముచ్చెర్ల, పందలపాక, తర్లువాడ, రామవరం, శిర్లపాలెం, భీమన్నదొరపాలెం, కణమాం, వెల్లంకి, వేములవలస, పాలవలస, శొంఠ్యాం పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 29 మంది నామినేషన్లు వేశారు. అలాగే భీమిలి మండలంలో 16 పంచాయతీలు ఉండగా తొలిరోజు పెదనాగమయ్యపాలెం, అమనాం, మూలకుద్దు, రేఖవానిపాలెం,టి.నగరపాలెం సర్పంచ్‌ పదవులకు 12 మంది, పద్మనాభం మండలంలో 22 గ్రామ పంచాయతీలకుగాను తొలిరోజు అనంతవరం, గంధవరం, పెంట, పద్మనాభం, తునివలస, రెడ్డిపల్లి, పొట్నూరు, వెంకటాపురం, బుడ్డివలస అగ్రహారం, చిన్నాపురం, విలాస్క్‌వానిపాలెం సర్పంచ్‌ పదవులకు 20, పెందుర్తి మండలంలో 15 పంచాయతీలలో సరిపల్లి, గవరపాలెం, ముదపాక, వాలిమెరక, పినగాడి, ఎస్‌.ఆర్‌.పురం సర్పంచ్‌ పదవులకు 12 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు డీపీవో ఎం.వి.ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకూ గడువు ఉంది.

Updated Date - Nov 22 , 2026 | 01:23 AM