గ్రేటర్‌లో ఎన్నికల సందడి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:40 AM
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉండడంతో ఆశావహులు, అధికారుల్లో కోలాహలం మొదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రిజర్వేషన్‌లపై నిర్ణయం...అనంతరం జీవోలు
వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌పై 12న హైకోర్టులో విచారణ
అదేరోజు సాయంత్రం మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
14 లేదా 15 తేదీల్లో నోటిఫికేషన్
ఆశావహుల్లో కోలాహలం
రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉండడంతో ఆశావహులు, అధికారుల్లో కోలాహలం మొదలైంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలను జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేసింది. అయితే మేయర్, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు తహతహలాడుతున్న ఆశావహులు మాత్రం రిజర్వేషన్‌లపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికోసం న్యాయపరమైన అడ్డంకులను క్లియర్ చేసుకుంది. జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు తెలిపేందుకు తగిన సమయం ఇవ్వకుండా తుది నోటిఫికేషన్ జారీ చేశారంటూ జనసేనకు చెందిన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో వేసిన కేసు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఆ కేసుపై తుది విచారణ సోమవారం జరుగుతుంది. సోమవారం కోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని కోరే అవకాశం ఉంది. అదేరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల ఎన్నికలకు షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదివారం లేదా సోమవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఆదివారం లేదా సోమవారం మేయర్/మునిసిపల్ చైర్‌పర్సన్ పదవులతోపాటు వార్డుల వారీగా కార్పొరేటర్ పదవులకు రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈనెల 12న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ జారీ అవుతుందని సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ప్రకటించారు. పన్నెండో తేదీన షెడ్యూల్ విడుదలైతే అప్పటి నుంచి రెండు లేదా మూడో రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుంది. నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి 15వ రోజున పోలింగ్ ఉంటుంది. పోలింగ్ జరిగిన మూడో రోజున కౌంటింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల సమావేశంలో ప్రకటించింది. జీవీఎంసీ ఎన్నికలపై స్పష్టత రావడంతో ఆశావహుల్లో హడావిడి మొదలైంది. తమకు అవకాశం కల్పించాలని నేతలను కలుస్తున్నారు.
రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ
జీవీఎంసీ మేయర్ పదవికి ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో కూటమిలో భారీ పోటీ నెలకొంది. టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు మేయర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు మాజీ కార్పొరేటర్లు, ఆర్థికంగా సంపన్నులైన నేతలు కూడా పోటీపడుతున్నారు. అంతా మేయర్ పదవి ఎవరికి రిజర్వు అవుతుందో నని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ ఎలా వచ్చినాసరే పోటీకి దిగేలా తమ కుటుంబ సభ్యులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా మేయర్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. ఓసీ రిజర్వేషన్ అయితే ఇద్దరు నేతలు, బీసీ రిజర్వేషన్ అయితే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకుంటున్నవారు కూడా రిజర్వేషన్‌ల ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. మహిళ అయితే తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దింపేలా వారిపేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్ను ఎన్‌ఓసీలను సిద్ధం చేసుకుంటున్నారు.
రిజర్వేషన్‌లపై జిల్లా గెజిట్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు శనివారం మంత్రివర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి జీవోలు జారీ కానున్నాయి. అనంతరం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారును జిల్లా స్థాయిలో కలెక్టర్ (జిల్లా ఎన్నికల అథారిటీగా పిలుస్తారు) చేపడతారు. ఇందుకు రెండు, మూడు రోజులు సమయం పడుతుంది. రిజర్వేషన్ల ఖరారు వివరాలను జిల్లా గజిట్‌లో ప్రచురిస్తారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్/మునిసిపల్ కమిషనర్లకు కలెక్టర్ నివేదించాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వివరాలు అందుకున్న తరువాత ఇద్దరు (పంచాయతీరాజ్/మునిసిపల్) కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తరువాత షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు రూ.10 కోట్లు
జోన్‌ల వారీగా టెండర్లు ఆహ్వానం
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్ర జ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రణాళికబద్ధంగా ముందుకువెళుతున్నారు. గ్రేటర్ పరిధిలోని 120 వార్డుల్లో గల 1,990 పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సదుపాయం, షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్లు ఏర్పాటుకోసం జోన్‌ల వారీగా తాజాగా టెండర్లు పిలిచారు. ఓటు వేసేందుకు వచ్చే దివ్యాంగులకు వీల్ చైర్‌లు అందుబాటులో ఉంచడం, ర్యాంప్‌లు ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయడం, ఇతర ముఖ్యమైన పత్రాలను కవర్‌లో భద్రపరచడం కోసం అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం కూడా షార్ట్‌టెండర్‌లు పిలిచారు. ఒక్కో జోన్‌కు సగటున రూ.కోటి చొప్పున కేటాయిస్తూ రూ.పది కోట్లతో వేర్వేరుగా టెండర్లు పిలిచారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వర్క్ ఆర్డర్ తీసుకున్న 15రోజుల్లోగా పనులను పూర్తిచేయాల్సి ఉంటుందని నిబంధన విధించారు.
జడ్పీ పోరుకు సన్నద్ధం
విశాఖ నుంచి మూడు జిల్లాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణ
39 మంది ఎంపీడీవోలతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పనపై దృష్టి
ఎన్నికల సామగ్రి కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం
బ్యాలెట్‌ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లు గుర్తింపు
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల నిర్వహణకు జిల్లా పరిషత్, పంచాయతీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి) జిల్లా పరిషత్‌లు వేర్వేరుగా ఏర్పాటైనప్పటికీ విశాఖ జడ్పీ అధికారులే ఎన్నికల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేయాలని మూడు జిల్లాల పరిధిలోని 39 మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చునని భావిస్తున్నారు.
మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసిన అధికారులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల వివరాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. వాటి ప్రకారం రిజర్వేషన్లపై ఒక అంచనాకు వచ్చారు. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదలవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలని ఎంపీడీవోలను విశాఖపట్నం జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఆదేశించారు. శుక్రవారం 39 మండల పరిషత్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలని, మరమ్మతులు ఏవైనా ఉన్నట్టయితే వెంటనే చేయించాలని, పోలింగ్ బాక్సులు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అంటే స్టేషనరీ కొనుగోలుకు జడ్పీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణపై అధికారులు దృష్టిసారించారు. బ్యాలెట్ పేపర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ నుంచి సరఫరా చేస్తారు. ఆ పేపర్లు జిల్లాకు వచ్చిన తరువాత స్థానికంగా ఎంపిక చేసిన ముద్రణాలయాలకు పంపుతారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో తుది జాబితా రూపొందించి ముద్రణాలయాలకు ఇస్తారు. అక్కడ పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన బ్యాలెట్లు నగరంలోనే ముద్రించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. మూడు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని, పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించారు. ఇదిలావుండగా విశాఖ జిల్లాలో గల నాలుగు మండలాల పరిధిలోని 79 పంచాయతీల ఎన్నికలకు జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మెటీరియల్ కొనుగోలు పనుల్లో ఉన్నారు.