Share News

గ్రేటర్‌లో ఎన్నికల సందడి

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:20 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఎన్నికల సందడి మొదలైంది.

గ్రేటర్‌లో ఎన్నికల సందడి

ప్రత్యక్ష విధానంలో మేయర్‌ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం

సెప్టెంబరు 3న ఓటర్ల జాబితా ప్రకటన

అదేరోజు పోలింగ్‌ స్టేషన్లు గుర్తింపు, నోటిఫికేషన్‌

సెప్టెంబరు 27-30 మధ్య రిజర్వేషన్లు ఖరారు

ఇప్పటికే 120 వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి

అంతా అనుకున్నట్టు జరిగితే

డిసెంబరు నెలాఖరులోగా ఎన్నిక

కార్పొరేటర్‌, మేయర్‌ ఆశావహుల్లో ఉత్సాహం

(విశాఖపట్నం-ఆంద్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మునిసిపల్‌ చైర్మన్లు, మేయర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం (ప్రజలు నేరుగా ఎన్నుకునేలా) అవలంబించాలని అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో మంగళవారం బిల్లు ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల మూడున ఓటర్ల జాబితా ప్రకటనతోపాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, నోటిఫికేషన్‌ పూర్తిచేసి, నెలాఖరులోగా వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాలని భావిస్తోంది. దీంతో కార్పొరేటర్‌, మేయర్‌ పదవులు ఆశిస్తున్న వారిలో హడావిడి మొదలైంది.

జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల్లో జనాభాను బట్టి వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 29న ప్రభుత్వం షెడ్యూల్‌ జారీచేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల పైబడిన కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య 120 ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం జీవీఎంసీ పరిధిలో 19 లక్షల జనాభా ఉండడంతో వార్డుల సంఖ్యను 98 నుంచి 120 చేయాలని ఆదేశించింది. పునర్విభజన తర్వాత 120 వార్డులకు సరిహద్దులు నిర్ణయిస్తూ మే 18న అధికారులు ప్రాథమిక ముసాయిదాను విడుదల చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత తుది ముసాయిదాను తయారుచేసిన అధికారులు జూన్‌ ఐదున రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజనపై కోర్టు స్టే విధించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు వివాదాలను పరిష్కరించి ఇప్పటికే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ జారీచేసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలను పూర్తిచేయాలని నిర్ణయించింది.

వచ్చే నెల మూడున ఓటర్ల జాబితా ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 స్థానిక సంస్థల్లో 100 స్థానిక సంస్థల్లో ఇప్పటికే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ జారీచేయడంతోపాటు ప్రక్రియ కొలిక్కివచ్చినందున వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల మూడున ఓటర్ల జాబితాను ప్రకటించడం, అదేరోజు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, నోటిఫికేషన్‌ కూడా జారీచేయాలని అధికారులను ఆదేశించింది. సెప్టెంబరు 27 నుంచి 30 మధ్య వార్డుల రిజర్వేషన్లు పూర్తిచేసి గెజిట్‌ ప్రచురించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇదంతా పూర్తయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యలో జీవీఎంసీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఆశావహుల హడావిడి

మేయర్‌ పదవికి ప్రత్యక్ష విధానంలో ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆశావహుల్లో హడావిడి మొదలైంది. సోమవారం తమకు తెలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేసి ఎన్నిక జరుగుతుందా? లేదా?, ఎప్పుడు ఉండవచ్చునని ఆరా తీశారు. ఇక ఇప్పటికే కార్పొరేటర్లుగా పనిచేసినవారు తిరిగి పోటీ చేయాలని ఉత్సాహపడుతుండగా, కొత్తగా టికెట్‌ ఆశిస్తున్నవారు కూడా అవకాశం కోసం పోటీపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడిగానే పోటీకి దిగనున్నాయి. వైసీపీ నుంచి కార్పొరేటర్‌ సీటు ఆశిస్తున్నవారు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను కలుస్తున్నారు. మరోవైపు మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రధాన రాజకీయపార్టీల్లోని ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలోపడ్డారు.

ఆన ందపురం, పద్మనాభం విలీనం లేనట్టే?

ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రారంభమైన జీవీఎంసీతోపాటు రాష్ట్రంలోని వంద పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆనందపురం, పధ్మనాభం మండలాలతోపాటు భీమిలి, పెందుర్తి మండలాల్లోని మిగిలిన పంచాయతీల విలీన పతిపాదనను పరిగణనలోకి తీసుకోనట్టేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న జీవీఎంసీ పరిధిలోనే 120 వార్డులకు ఎన్నిక జరిగే అవకాశం ఉందని, కొత్త ప్రాంతాల విలీనం, వార్డుల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పునర్విభజన జరిగిన 120 వార్డులతోనే ఎన్నిక జరపాలనుకుంటే అక్టోబరు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు

నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు

25న ముసాయిదా జాబితా

వచ్చే నెల ఏడో తేదీన తుది ఓటర్ల జాబితా

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సన్నాహాలు ప్రారంభించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసిన పంచాయరాజ్‌ శాఖాధికారులు, ప్రతి పంచాయతీలో వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉంటుంది. ఈనెల 23వ తేదీలోగా జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల పరిధిలో గల 802 వార్డుల్లో పోలింగ్‌ బూత్‌లపై నివేదిక సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై ముందడుగు పడింది. పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన చేపట్టేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందుకోసం మంగళవారం నుంచి ఇంటింటా గణన చేయనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 22వ తేదీ వరకు చేపడతారు. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను గుర్తిస్తారు. ఈనెల 25వ తేదీన మసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిపై 29వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు విచారణ చేపట్టి, మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తారు. ఏడో తేదీన పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తరువాత రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్రపునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 01:20 AM