అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడి సజీవదహనం
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:40 AM
తాను అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వృద్ధుడిని సజీవ దహనం చే సిన ఘటన పాడేరు మండలం మారుమూల ఐనాడ పంచాయతీ చింతపాలెంలో ఈ నెల 23న చోటుచేసుకుంది.
పాడేరు మండలం మారుమూల ఐనాడ పంచాయతీ చింతలపాలెంలో ఘటన
మారుమూల ప్రాంతం కావడంతో ఆలస్యంగా వెలుగులోకి..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పాడేరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): తాను అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వృద్ధుడిని సజీవ దహనం చే సిన ఘటన పాడేరు మండలం మారుమూల ఐనాడ పంచాయతీ చింతపాలెంలో ఈ నెల 23న చోటుచేసుకుంది. ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... ఐనాడ పంచాయతీ చింతలపాలెం గ్రామానికి చెందిన వంతాల సోమన్న అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన కొర్రా రామన్న(60)అనే వ్యక్తి అప్పుగా రూ.5,600 ఇచ్చారు. అయితే అప్పు తీసుకుని చాలా రోజులు కావడంతో తన డబ్బులు ఇవ్వమని రామన్న తరచూ సోమన్నను అడుగుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23న సోమన్నను రామన్న తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. రామన్నను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసిన సోమన్న, తన భార్య దేవి సహాయంతో ఈ నెల 23న రాత్రి రామన్న నిద్రిస్తున్న సమయంలో అతని ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. అయితే తొలుత అందరూ చలి మంట కారణంగా రామన్న ఇల్లు కాలిపోయి సజీవ దహనమయ్యాడని భావించినప్పటికీ, సోమన్న తన భార్యతో కలిసి ఊరు నుంచి పరారీ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం విషయం తెలుసుకున్న స్థానిక సీఐ డి.దీనబందు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సోమన్న, అతని భార్య దేవి పరారీలో ఉండడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.