పూరిగుడిసెకు నిప్పంటుకుని వృద్ధుడి సజీవ దహనం
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:01 AM
స్నానానికి నీళ్లు కాచేందుకు పొయ్యి వెలిగించాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పూరిపాకకు అంటున్నాయి. వయసు మీదపడడంతో బయటకు వెళ్లలేక మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. మండలంలోని కవ్వగుంటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.
స్నానానికి నీళ్లు కాచేందుకు పొయ్యి వెలిగించగా.. ఎగిసిన మంటలు
ఊరిగా దూరంగా నివాసం కావడంతో మృత్యువాత
రావికమతం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): స్నానానికి నీళ్లు కాచేందుకు పొయ్యి వెలిగించాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పూరిపాకకు అంటున్నాయి. వయసు మీదపడడంతో బయటకు వెళ్లలేక మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. మండలంలోని కవ్వగుంటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.
కవ్వగుంట గ్రామానికి చెందిన రొబ్బా చినకల్యాణం దొర(62) వ్యవసాయం చేసుకుంటూ, మరోవైపు చర్యవ్యాధులకు సంబంధించి మూలికల వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలోనే మృతిచెందగా, ప్రస్తుతం పెద్దేరు కాలువ గట్టును ఆనుకొని వున్న తన వ్యవసాయ భూమిలో పూరిగుడిసె వేసుకుని నివాసం వుంటున్నాడు. రోజూ ఉదయం, సాయంత్రం భోజనం చేయడానికి గ్రామంలో వున్న కుమారుల వద్దకు వెళ్లి వస్తుంటాడు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నిద్ర లేచి, స్నానానికి వేడి నీళ్ల కోసం పూరిగుడిసెలో పొయ్యిని వెలిగించాడు. ఈ క్రమంలో ఆకస్మికంగా మంటలు ఎగిసి, పూరిగుడిసెకు అంటుకున్నాయి. వృద్ధాప్యం కారణంగా కల్యాణం దొర బయటకు వెళ్లలేక మంటల్లో చిక్కుకున్నాడు. సమీపంలో ఇళ్లు లేకపోవడంతో ఎవరూ కాపాడలేకపోయారు. ఇదే సమయంలో నిద్రలేచిన కొంతమంది.. పెద్దేరు కాలువ గట్టువైపు కల్యాణం దొర వుంటున్న ఇల్లు కాలిపోవడాన్ని గమనించారు. ఈ విషయాన్ని ఆయన కుమారులకు చెప్పారు. అంతా కలిసి పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. అప్పటికూ పూర్తిగుడిసె పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని కల్యాణం దొర సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. వీఆర్వో ఎస్.ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతిచెందిన కల్యాణందొర తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో టీడీపీ మండల అధ్యక్షుడు కోమటి శంకరరావు, మాడుగుల, రావికమతం మండలాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు కవ్వగుంట వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.