Share News

ఎలమంచిలి స్టేషన్‌కు సొబగులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 01:56 AM

స్థానిక రైల్వే స్టేషన్‌ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు మరికొద్ది వారాల్లో పూర్తికానున్నాయి.

ఎలమంచిలి స్టేషన్‌కు సొబగులు

అమృత్‌ భారత్‌ పథకం కింద మూడేళ్ల క్రితం ఎంపిక

రూ.13.13 కోట్లతో ఆధునికీకరణ పనులు

ప్రయాణికులకు వెయిటింగ్‌ హాలు

కొత్తగా ఫుట్‌ ఓవర్‌ వంతెన, లిఫ్టులు

ప్లాట్‌ ఫారాలపై గ్రానైట్‌ పలకలు, యాంటీ స్కిడ్‌ టైల్స్‌, రేకుల షెడ్లు

స్టేషన్‌ బయట సుందరీకరణ పనులు

వచ్చే నెలాఖరులోగా పూర్తవుతాయంటున్న అధికారులు

మరిన్ని రైళ్లకు హాల్ట్‌ కల్పించాలని ప్రయాణికుల వినతి

ఎలమంచిలి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

స్థానిక రైల్వే స్టేషన్‌ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు మరికొద్ది వారాల్లో పూర్తికానున్నాయి. వాస్తవానికి ఏడాది క్రితమే ఈ పనులు పూర్తికావాల్సి వున్నప్పటికీ చాలా కాలం నత్తనడకన సాగాయి. రెండు నెలలు క్రితం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ ఏడీఆర్‌ఎం, ఇతర అధికారులు ఈ రైల్వే స్టేషన్‌ను సందర్శించి, ఆధునికీకరణ పనులను పరిశీలించారు. చాలా నెమ్మదిగా జరగడంపై కాంట్రాక్టర్‌ను, కిందిస్థాయి అధికారులను ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులన్నీ పూర్తిచేయాలని ఏడీఆర్‌ఎం ఆదేశించారు. దీంతో అప్పటి నుంచి పనులు ఊపందుకొన్నాయి.

అమృత్‌ భారత్‌ పథకం కింద ఎంపికైన ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు సకల సదుపాయాల కల్పనకు రూ.13.13 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. వీటిని ఏడాదిన్నరలో పూర్తిచేయాలన్న లక్ష్యం. ఆరంభంలో పనులు వేగంగానే సాగాయి. తరువాత పూర్తిగా మందగించాయి. విజయవాడ డివిజన్‌ అధికారులు రెండు నెలల క్రితం పర్యటించి వెళ్లిన తరువాత పనుల్లో వేగం పుంజుకుంది. రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణలో భాగంగా ప్రయాణికులకు పలు రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు చేపట్టిన వెయింటింగ్‌ హాలు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ప్లాట్‌ ఫారాలపై గ్రానైట్‌ పలకలు, అవసరమైనచోట యాంటీ స్కిడ్‌ టైల్స్‌ వేశారు. రెండు, మూడో ప్లాట్‌ఫారాలపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రైళ్ల కోసం వేచి వుండే ప్రయాణికులకు ఎండ తగలకుండా, వర్షం కురిస్తే తడిసిపోకుండా వుండేందుకు రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్‌కు ఎడమ వైపున కొత్త ఫుట్‌ఓవర్‌ వంతెన నిర్మించారు. దీనికి అనుసంధానంగా ఒకటి, రెండు/ మూడు ప్లాట్‌ఫారాలకు లిఫ్ట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్‌ ప్రవేశ మార్గాన్ని అందంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. సువిశాలమైన స్థలంలో వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు.

మరిన్ని రైళ్లకు హాల్ట్‌ కల్పించాలి

కాగా ఎలమంచిలి స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు ముగింపు దశకు వచ్చినందున రైల్వే అధికారులు ముఖ్యమైన మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్‌ కల్పించడానికి చర్యలు చేపట్టాలని నియోజకవర్గం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఇప్పటికే పలు భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రానున్న ఏడాది కాలంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని, అందువల్ల ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు అధికం అవుతాయని అంటున్నారు. వీరితోపాటు నియోజకవర్గం ప్రజల కోసం మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఇక్కడ హాల్ట్‌ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఈ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 01:56 AM