Share News

గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:07 AM

ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ నెల 26న గణతంత్ర దిన వేడుకల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

అభివృద్ధి, సంక్షేమంపై శకటాల ప్రదర్శన

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ నెల 26న గణతంత్ర దిన వేడుకల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రొటోకాల్‌ ప్రకారం ఆయా రంగాలకు చెందిన వారిని ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ శకటాలను రూపొందించాలని చెప్పారు. సాధారణ పౌరులు వేడుకులను వీక్షించేందుకు అనువుగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గీతాలపన, ప్రగతి నివేదిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, తదితర కార్యక్రమాల ఏర్పాట్లలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.


ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించి అన్ని రకాల వసతులు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి ఎం.వినోద్‌బాబు మాట్లాడుతూ, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ (స్పెషల్‌ బ్రాంచి) మోహన్‌రావు, డీఈవో అప్పారావునాయడు, డీఎంహెచ్‌ఓ హైమావతి, ఆర్టీసీ డీఎం ప్రవీణ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:07 AM