Share News

యోగాంధ్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:20 AM

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 21న యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

యోగాంధ్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, డీఆర్‌వో లోకేశ్వరరావు

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పీజీఆర్‌ఎస్‌ పట్ల అలసత్వంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక

పాడేరు/హుకుంపేట, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 21న యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. యోగ దినోత్సవం, పీజీఆర్‌ఎస్‌, జనగణన, తదితర అంశాలపై హుకుంపేటలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యోగపై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7న జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, 8న హుకుంపేట మండలం మత్స్యగుండంలో యోగ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 21 వరకు నియోజకవర్గం, మండల స్థాయిల్లో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకుల సెల్‌ ఓఎస్‌డీ సమన్వయంతో యోగ దినోత్సవ ఏర్పాట్లు చేస్తారని, ఆయుష్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ మౌనిక జిల్లా యోగ నోడల్‌ అఽధికారిగా వ్యవహరిస్తారన్నారు. యోగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లలో పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గడువులోగా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు మండల పరిధిలో జనగణనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి వివరాలు నమోదు కావాలన్నారు. అలాగే 2011 నాటి వివరాలు, 2026లో నమోదైన వివరాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించాలని, వివరాలు పక్కాగా ఉండేలా చూడాలని కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు విశేష స్పందన

హుకుంపేటలోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని అన్ని పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో జనం వచ్చారు. మొత్తం 160 అర్జీలను అందజేశారు. వీటిని కలెక్టర్‌ పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలో జరుగుతున్న రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన పలు శాఖ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, పీజీఆర్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.నీలకంఠరావు, డీఈవో రామకృష్ణారావు,. గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, గురుకులం సెల్‌ ఓఎస్‌డీ పీఎన్‌ఎస్‌.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:20 AM