Share News

రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:18 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30వ తేదీన నగరానికి వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు అత్యంత అప్రమత్తంతో ఉండాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు.

రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

30న నగరంలో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము హాజరు

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30వ తేదీన నగరానికి వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు అత్యంత అప్రమత్తంతో ఉండాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ 30న నోవాటెల్‌ హోటల్‌లో జరగనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. పర్యటన కోసం రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. స్నాతకోత్సవం జరిగే వేదిక వద్ద భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుధ్యం, విద్యుత్‌ సరఫరా, తదితర అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. రాష్ట్రపతి కార్యాలయం ఆమోదించిన షెడ్యూల్‌కు అనుగుణంగా అన్నీ కార్యక్రమాలు పూర్తిచేయాలన్నారు. పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం కోసం నోడల్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ఉంటారన్నారు. సమీక్షలో జేసీ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు సంగీత్‌మాధుర్‌, దిలీప్‌ చక్రవర్తి, గిరిజన వర్సిటీ రిజిస్ట్రార్‌ మిశ్రా, ఇతర ఆచార్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

30న గవర్నర్‌, ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రాక

గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతితోపాటు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర విద్యాశాఖా మంత్రి ధరేంద్రప్రధాన్‌, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ పాల్గొననున్నారు. వీరి పర్యటనకు సంబంధించి ఇంకా షెడ్యూల్‌ రావల్సి ఉంది.


పౌర సరఫరాల గోదాములో కొనసాగుతున్న తనిఖీలు

రేషన్‌ బియ్యం కుంభకోణంపై నోరు విప్పని అధికారులు

తమకేమీ కాదంటున్న శ్రీకాకుళం మిల్లర్లు

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తిలోని పౌర సరఫరాల గోదాములో ఉన్నతాధికారులు మరోమారు తనిఖీలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల ద్వారా సేకరించిన రేషన్‌ బియ్యాన్నే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గోదాముకు పంపిన 20 వేల టన్నుల్లో చాలావరకూ రేషన్‌ బియ్యమే ఉన్నట్టు ఆరోపణలు రావడంతో పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు ఈనెల రెండో వారంలో తనిఖీలు చేశారు. తాజాగా మరోమారు విశాఖపట్నం, అనకాపల్లి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, సహాయ మేనేజర్ల (టెక్నికల్‌) సమక్షంలో పరిశీలన చేపట్టారు. సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల పెందుర్తి గోదాములో విశాఖకు మూడు, అనకాపల్లి జిల్లాకు రెండు చిన్న గోదాములు ఉన్నాయి.

పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన బృందాలు గతంలో ఒకసారి బియ్యం శాంపిల్స్‌ తీసుకుని వెళ్లాయి. అయితే మరిన్ని శాంపిల్స్‌ తీసుకునేందుకు వచ్చినట్టు చెబుతున్నారు. గోదాములో ఏం జరిగిందనే దానిపై ఎవరూ నోరు విప్పడం లేదు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిల్లర్లు ఎంత మొత్తంలో రేషన్‌ బియ్యం పౌర సరఫరాల శాఖకు సరఫరా చేశారన్నది అధికారులు బహిర్గతం చేయాల్సి ఉంది. కానీ గుట్టుగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తనిఖీలు నామమాత్రమేనని తమకు ఏమీ కాదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మిల్లర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తనిఖీలకు వచ్చారు, వెళ్లారు.. అయితే ఏంటంటా...అని కొందరు మిల్లర్లు అంటున్నట్టు తెలిసింది.


గుర్రంపాలెంలో అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వకాలు

పట్టని రెవెన్యూ అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి మండలం గుర్రంపాలెంలో కొండపై గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. గ్రామానికి చెందిన ఒకరు..కొందరితో ముఠాగా ఏర్పడి పట్టపగలే అడ్డగోలుగా కొండను తవ్వుతున్నారు. గురువారం మధ్యాహ్నం యంత్రాలు తీసుకువెళ్లి గ్రావెల్‌, రాయి తవ్వి లారీల్లో తరలించారు. నెలనెలా అన్ని శాఖలకు మామూళ్లు పంపిస్తున్నందున తనను ఎవరూ ఏమీ చేయలేరని గ్రామస్థులకు సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం. కొండపై అక్రమ మైనింగ్‌ గురించి విశాఖ ఆర్డీవో సాధు దిలీప్‌ చక్రవర్తి దృష్టికి తీసుకువెళ్లగా పెందుర్తి రెవెన్యూ అధికారులను గుర్రంపాలెం పంపిస్తామని చెప్పారు. అక్రమ తవ్వకాల నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:18 AM