Share News

పరిషత్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:46 AM

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వీడియో చిత్రీకరణ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. పోలింగ్‌ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

పరిషత్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన ఎన్నికల పరిశీలకులు కూర్మనాథ్‌, ధీరజ్‌హన్స్‌

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీడియో చిత్రీకరణ

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి

- జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 9560334841

పాడేరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వీడియో చిత్రీకరణ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. పోలింగ్‌ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్‌ నిర్వహిస్తామని, అందుకు గాను 617 పోలింగ్‌ కేంద్రాల్లో ఆరుగురు చొప్పున సిబ్బదిని నియమించామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు 78 మంది జోనల్‌ అధికారులు, 117 రూట్‌ అధికారులను నియమించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ముందురోజు రాత్రి పోలింగ్‌ కేంద్రాల్లో ఉండే సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 149 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయని, వాటి పట్ల పోలీసులు అప్రమత్తమై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణను పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించామని, అభ్యర్థుల ప్రచారాలు, ఎన్నికల ఖర్చులపై ఆడిట్‌ నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సైతం సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని, అందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలను మూసివేయించామని, ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 617 పోలింగ్‌ కేంద్రాలకు గాను మారుమూల ప్రాంతాల్లోని 44 పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వారంతా పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉండాలని, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలను సృష్టించకూడదన్నారు.

ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 9560334841

జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమాచార స్వీకరణ, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 9560334841 అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విషయాలనైనా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌, జిల్లా వ్యయ పరిశీలకుడు ధీరజ్‌హన్స్‌, జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 01:47 AM