బ్రిక్స్ సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 21 , 2026 | 01:00 AM
బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.
22, 23 తేదీల్లో క్రీడా మంత్రుల సమావేశాలు
రాడిసన్ బ్లూ, నోవాటెల్ హోటల్‌లో నిర్వహణ
22న ముఖ్యమంత్రి రాక
కలెక్టర్ అభిషిక్త్‌కిశోర్
విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):
బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, అధికారులు నగరానికి రానున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈనెల 22, 23 తేదీల్లో రాడిసిన్‌బ్లూ, నోవాటెల్ హోటళ్లలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తిచేయాలన్నారు. విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రవాణా, వసతి ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద ప్రత్యేక రిసెప్షన్ డెస్క్‌లు ఏర్పాటుచేసి అతిథులకు సహాయం అందజేయాలన్నారు. జిల్లా అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. డ్యూటీ అధికారులు, సిబ్బందికి ముందుగానే పాస్‌లు మంజురుచేయాలన్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. 23న ఆర్కే బీచ్‌రోడ్డులో ఫ్రెండ్లీ సైక్లింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు.
22న విదేశీ క్రీడా మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం
22వ తేదీ సాయంత్రం విదేశీ క్రీడా మంత్రులతో నోవాటెల్ హోటల్‌లో జరిగే ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం విదేశీ అతిథులతో గాలా డిన్నర్ ఉంటుందని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గాలా డిన్నర్‌లో ముఖ్యమంత్రి, విదేశీ అతిథులతో కలిపి సుమారు 150 మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమీక్షలో శాప్ ఎండీ భరణి, డీసీపీ మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర క్రీడల సహాయ మంత్రి రాక రేపు
బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయమంత్రి రక్షనిఖిల్ శనివారం నగరానికి రానున్నారు. రెండురోజులపాటు జరగనున్న సదస్సులో పాల్గొని తిరిగి ఆదివారం సాయంత్రం భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వెళారు. కాగా రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఉదయం నగరానికి వస్తున్నారు. శనివారం నుంచి జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు.
23న బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు
సిరిపురం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆర్కే బీచ్‌రోడ్డులోకి వాహనదారులకు, పాదచారులకు అనుమతి లేదని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆదివారం బీచ్‌రోడ్డులో బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన క్రీడా మంత్రులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. దానికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు వాహనాలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. నడక, వ్యాయామం చేసే వారికి కూడా అనుమతి ఉండదన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.