Share News

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:39 AM

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ టి.నిషాంతి, ఇతర అధికారులు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2446 వార్డులకు మూడు విడతల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక సర్పంచ్‌, 132 వార్డులు ఏకగీవ్రం కావడంతో మిగిలిన 243 పంచాయతీలు, 2,314 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి విడతలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 66 పంచాయతీలు, 686 వార్డులకు ఈ నెల 26న, రెండో విడతలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో 87 పంచాయతీలు, 880 వార్డులకు ఈ నెల 29న, మూడో విడతగా పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో 91 పంచాయతీలు, 880 వార్డులకు డిసెంబరు 2న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణలు, ఇతర ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌ కలెక్టర్‌ కె.సాహిత్‌, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:39 AM