పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:03 AM
జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. పోలింగ్ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో 244 సర్పంచులు, 2,446 వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి
- 4,98,467 మంది ఓటర్లు
- 2,446 పోలింగ్ కేంద్రాలు
పాడేరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. పోలింగ్ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో 244 సర్పంచులు, 2,446 వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వాటిలో 239 షెడ్యూల్డ్, 5 నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పంచాయతీలున్నాయన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లను 2,446 పోలింగ్ కేంద్రాల్లో చేశామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కులను వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, పోటీలో ఉండే అభ్యర్థులు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఎవరూ ఎన్నికల నిబంధనలను అతిక్రమించవద్దని, పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.