మోదకొండమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 14 , 2026 | 12:50 AM
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, భోజన వసతి సదుపాయాలు, ప్రజా మరుగు దొడ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక శకటాల ఏర్పాటు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రధానంగా తాగునీటి సమస్యలు ఏర్పడకుండా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. పండుగ రోజుల్లో విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అదనపు పారిశుధ్య సిబ్బందిని రప్పించి పనులు చేయాలని పంచాయతీ విభాగం అధికారులకు సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆమె సూచించారు. అధికారులు, ఉత్సవ కమిటీ సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల రాకపోకలకు వంద ఆర్‌టీసీ బస్సులను నడపాలన్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులకు అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ఎల్.భాస్కరరావు, డీపీవో చంద్రశేఖరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ నాగేశ్వరరావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్, డీఈవో రామకృష్ణారావు, టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమిళ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.గౌరీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.