Share News

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:33 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్రపునేఠా ఆదేశం

కలెక్టర్లకు దిశానిర్దేశం

పాడేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎ.మల్లికార్జునతో కలిసి బుధవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ప్రీ ఎలక్షన్‌ ప్రక్రియ, పోలింగ్‌, కౌంటింగ్‌, ఓటర్ల విభజన, తదితర అంశాలపై కలెక్టర్లకు అనేక విషయాలను తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మూడు దశల ఎన్నికలపై అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. అందులో పట్టణాలకు సంబంఽధించిన అర్బన్‌ లోకల్‌ బాడీస్‌, తర్వాత మండలాలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నిక, గ్రామాలకు సంబంధించి రెండు విడతలుగా పంచాయతీల ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన 16వ రోజు పోలింగ్‌ నిర్వహించాలని, 19వ రోజున వాటిని ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసిన 14వ రోజున ఎన్నికలు, అదే రోజున ఫలితాలు వెల్లడించాలని పేర్కొన్నారు.

పోలింగ్‌ ఏర్పాట్లపై అవగాహన అవసరం

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సూచించారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేయడం, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రచురణలు, సిబ్బంది శిక్షణ, తదితర అంశాలపై అందరూ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలోని ప్రతి దశను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఓటర్ల వర్గీకరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల విభజనను సమగ్రంగా చేపట్టి ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఈ క్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.భుజంగరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:33 AM