గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:03 AM
ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహగిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
భక్తులకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకూడదు
అధికారులకు హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు
ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు
పలుచోట్ల నమూనా ఆలయాలు
28న నాలుగు మండలాల్లోని 212 విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్
విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహగిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి, నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్యను అంచనావేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు అనువైన ప్రాంతాల్లో నమూనా ఆలయాలు ఏర్పాటుచేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని హోంమంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ సందర్భంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చినగదిలి, సీతమ్మధార, గోపాలపట్నం, పెందుర్తి మండలాల పరిధిలో గిరి ప్రదక్షిణ మార్గానికి సమీపానున్న 212 పాఠశాలలు/కళాశాలలకు ఈనెల 28వ తేదీన సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ వెల్లడించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్, ఎన్టీఆర్ వైద్యట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, దిలీప్ చక్రవర్తి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరి ప్రదక్షిణకు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు
ఐదు వేల మంది ఉద్యోగులకు విధులు
28 సహాయ కేంద్రాలు, ఏడు కంట్రోల్‌రూమ్‌లు
ట్రాఫిక్ మళ్లింపు
సముద్ర స్నానాల వద్ద 90 మంది గజ ఈతగాళ్లు
మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
సింహగిరి ప్రదక్షిణలో ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 28వ తేదీ ఉదయం నుంచి తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు ప్రదక్షిణ ప్రారంభిస్తారని, మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి వారి రథం ప్రారంభమవుతుందన్నారు. రద్దీ నియంత్రణకు తొలిపావంచా వద్ద 50 క్యూలైన్లు, కొబ్బరికాయలు కొట్టేందుకు 120 ఇనుప స్టాండ్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా మొత్తం ఐదు వేల మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారని, వారిలో 2,500 మంది పోలీసులు ఉంటారన్నారు. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గంలో 28 సహాయ కేంద్రాలు, ఏడు ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు (తొలిపావంచా, అడవివరం జంక్షన్, హనుమంతువాక జంక్షన్, అప్పుఘర్, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్ గేటు, పాతగోశాల వద్ద) ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇంకా 31 వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామని, 22 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కోసం 115 వాటర్ పాయింట్లు, ఇంకా 595 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుచేస్తామన్నారు.
భక్తుల రద్దీ, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించడానికి కొండదిగువన 70 తాత్కాలిక సీసీ కెమెరాలు, కొండపై ఇప్పటికే ఉన్న వాటితోపాటు 45 అదనపు కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. హనుమంతువాక, వెంకోజీపాలెం ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటే భక్తులు అధికంగా ఉంటున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 28వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు హనుమంతువాక, శొంఠ్యాం వైపు నుంచి వచ్చే బస్సులను అడవివరం జంక్షన్ వద్ద నిలిపివేస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే వాహనాలను ఆనందపురం, సబ్బవరం, లంకెలపాలెం మీదుగా నగరంలోకి మళ్లిస్తామన్నారు. నగరం నుంచి బయటకు షీలానగర్, గాజువాక, లంకెలపాలెం మీదుగా వెళ్లాలన్నారు. సముద్ర స్నానాలు చేసే ప్రాంతాల్లో 900 మంది గజ ఈతగాళ్లను నియమించనున్నట్టు మంత్రి తెలిపారు. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం తీరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఈతగాళ్లు మూడు షిఫ్టులలో పనిచేస్తారన్నారు. భక్తుల కోసం 28వ తేదీ ఉదయం ఐదు నుంచి రాత్రి 11 గంటల వరకు, 29వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సింహగిరిపైకి బస్సులు నడుపుతామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రాతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పాల్గొన్నారు.