సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:47 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీన పాయకరావుపేట పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మంత్రి వంగలపూడి అనిత ఆదేశం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి రవీంద్రతో కలిసి సమీక్ష
పాయకరావుపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీన పాయకరావుపేట పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం నక్కపల్లి మండలంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కల అని, ఇన్నాళ్లకు ఆ కలను సీఎం చంద్రబాబునాయుడు సాకారం చేస్తున్నారని అన్నారు. వచ్చే బుధవారం పోలవరం ఎడమ కాలువకు పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, సీఎం పర్యటనకు వేలాది మంది రైతులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రగడ నాగేశ్వరరావు, గండి బాబ్జీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.