Share News

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:50 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న సందర్భంగా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా వేర్వేరుగా గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కోడూరులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

పరిశీలించిన కలెక్టర్‌, జేసీ, ఎస్పీ

1,200 మందితో పోలీసు బందోబస్తు

కె.కోటపాడు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న సందర్భంగా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా వేర్వేరుగా గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్‌ నిర్మాణ పనులు, హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వద్దకు వచ్చే రోడ్డు మార్గం పనులను పరిశీలించి అధికారులకు పలుసూచనలు చేశారు. ఎస్సీ కాలనీలో ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననందున అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా 1,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 39 సీఐలు, 90 ఎస్‌ఐలు, 170 ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది కానిస్టేబుళ్లు, 146 మంది మహిళా కానిస్టేబుళ్లు, 151 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారన్నారు.

సీఎం పర్యటన వివరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎ.కోడూరులోని ఎంపీపీ స్కూల్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. హైస్కూల్‌ పక్కన ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తరువాత టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతారు. కలెక్టర్‌, ఎస్పీ వెంట పోలీసు అధికారులు ఎస్‌వీ రమణ, బి.రాజ్‌కుమార్‌, ఎల్‌.మోహనరావు, జీఆర్‌ఆర్‌ మోహన్‌, ఈ.శ్రీనివాసులు, కె.రవికుమార్‌, ఆర్డీవోలు వీవీ రమణ, షేక్‌ ఆయీషా, ఇతర అధికారులు వున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:51 AM