ఖరీఫ్‌కు ఎల్‌నినో దెబ్బ
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:34 PM
ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వరి సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో వేసిన వరినారు ముదిరిపోయింది. దీంతో నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
- సగానికి పడిపోయిన వరి సాగు విస్తీర్ణం
- వర్షాలు లేక ఎండిపోతున్న వరినాట్లు
అరకులోయ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వరి సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో వేసిన వరినారు ముదిరిపోయింది. దీంతో నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా మండలంలో ఎనిమిది వేల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు నాలుగు వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. అయితే ఈ భూముల్లో కూడా వర్షాలు లేక వరినాట్లు ఎండిపోతున్నాయి. కొన్ని పొలాలు బీటలు వారిపోతున్నాయి. ఇప్పటికే వేసిన వరినారు వర్షాలు లేకపోవడంతో దమ్ములు పట్టకపోవడంతో ముదిరిపోయింది. ఇది నాట్లు వేయడానికి పనికిరాదని గిరి రైతులు చెబుతున్నారు. కాగా వర్షాలు లేక వరినాట్లు వేయని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ప్రధానంగా కంది, బొబ్బర్లు, రాజ్‌మా వంటి పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కంది, వలిసెలు, రాజ్‌మా, బొబ్బర్లు విత్తనాలను వ్యవసాయ శాఖాధికారులు రాయితీపై పంపిణీ చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.