సొంత గూటికి ఏకలవ్య పాఠశాల
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:41 PM
డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల సొంత గూటికి తరలి వెళ్లింది. ఇక్కడ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ భవనాల నిర్మాణాలకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన భవన నిర్మాణాల్లో తొలి విడతగా పాఠశాల, హాస్టల్ నిర్వహించేందుకు అవసరమైన భవనాలను సిద్ధం చేశారు. వాటిని పాఠశాల యాజమాన్యానికి ఇంజనీరింగ్ అధికారులు అప్పగించారు. దీంతో శని, ఆదివారాల్లో ప్రిన్సిపాల్, స్టాఫ్ కొత్త క్వార్టర్స్‌కి షిఫ్ట్ అయ్యారు.
అందుబాటులోకి డుంబ్రిగుడ భవనాలు
తొలి విడతగా కొన్ని భవనాలు అప్పగింత
క్వార్టర్స్‌కు షిఫ్టు అయిన ప్రిన్సిపాల్, స్టాఫ్
విద్యార్థులకు తీరనున్న వసతి సమస్య
ఇన్నాళ్లు చాలీచాలని వసతితో ఇబ్బంది పడిన విద్యార్థులు
అరకులోయ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):
పాడేరు మన్యంలోని 11 మండలాలకు 11 ఏకలవ్య మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తొలుత ఆయా మండలాల్లో ఉన్న భవనాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. అయితే డుంబ్రిగుడలో భవనాలు లేకపోవడంతో అరకులోయ ఏకలవ్య మోడల్ స్కూల్‌తో పాటు ఐటీడీఏకు చెందిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. డుంబ్రిగుడలో ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.20.6 కోట్లు మంజూరు చేసింది. తొలుత రూ.12 కోట్లు, రెండో విడత రూ.ఐదు కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి చేశారు. తొలి విడతలో మంజూరైన రూ.12 కోట్లతో ఏడు భవనాలు నిర్మించారు. ఈ ఏడు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌ల్లో తరగతుల నిర్వహణ, గర్ల్స్ డార్మిటరీ, బాయ్స్ డార్మిటరీ, కిచిన్ కమ్ డైనింగ్‌హాల్ , ప్రిన్సిపాల్ క్వార్టర్, టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్, నాన్‌టీచింగ్ క్వార్టర్స్‌ను పూర్తి స్థాయిలో నిర్మించారు. రెండో విడతలో విడుదలైన రూ. ఐదు కోట్లతో స్కూల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ , సెకెండ్ ఫ్లోర్, డార్మిటరీ గర్స్ (ఫస్ట్‌ఫ్లోర్) నిర్మాణాలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఆర్టికల్ 275(1)గ్రాంట్ కింద రూ.3.6 కోట్లతో టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ (ఫస్ట్, సెకెండ్ ఫ్లోర్స్‌లలో 4 క్వార్టర్లు), నాన్ టీచింగ్ స్టాఫ్ క్వార్టర్సు (ఫస్ట్, సెకెండ్ ఫ్లోర్‌లో 4 క్వార్టర్లు) నూతన స్టాఫ్ క్వార్టర్స్ భవనం (మొత్తం మూడు ఫ్లోర్స్‌లో నాలుగేసి క్వార్టర్సు చొప్పున 12 క్వార్టర్సు) పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అరకు సబ్‌డివిజన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పూర్తయిన భవనాలలో పాఠశాల, హాస్టళ్లను నిర్వహించుకునే విధంగా భవనాలను పూర్తి చేసి పాఠశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించామని గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వేణుగోపాల్ తెలిపారు. డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ స్కూల్‌లో 480 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఫ్లస్ టూ వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే ఈ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. పాఠశాల భవనాలు అప్పగించడంతో శని,ఆదివారాల్లో ప్రిన్సిపాల్, స్టాఫ్ నూతన క్వార్టర్లలోకి షిఫ్ట్ అయ్యారు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన విద్యార్థులు ఈనెల 20వ తేదీన వచ్చిన తర్వాత వారిని కూడా నూతన భవనాలకు తరలిస్తామని ప్రిన్సిపాల్ ఎస్‌కే సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యార్థులకు సమాచారాన్ని ఇచ్చామని ఆయన తెలిపారు.