Share News

‘ఏకలవ్య’ పిలుస్తోంది..

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:56 PM

నవోదయ పాఠశాలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆదివాసీ విద్యార్థులకు ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాల(ఈఎంఆర్‌)లో కార్పొరేటు స్థాయి విద్యను అందిస్తున్నది. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ గురుకులం అధికారులకు అప్పగించింది. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఏకలవ్య పాఠశాలల యాజమాన్యం ఆహ్వానిస్తోంది.

‘ఏకలవ్య’ పిలుస్తోంది..
చింతపల్లి ఏకలవ్య పాఠశాల

నవోదయకు దీటుగా ఏకలవ్య

కార్పొరేటు స్థాయిలో సదుపాయాలు

ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

12వ తరగతి వరకు ఉచిత విద్య, సీబీఎస్‌ఈ సిలబస్‌

జిల్లాలో 11 పాఠశాలలు, ఒక్కొక్క పాఠశాలలో 60 సీట్లు

దరఖాస్తుకు గడువు 28వ తేదీ

ఏప్రిల్‌ 4వ తేదీన రాత పరీక్ష

చింతపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతంల్లో 750 ఈఎంఆర్‌ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఏర్పాటు చేసింది. ఏపీలో 28 పాఠశాలలు ఉండగా.. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 పాఠశాలలు ఉన్నాయి. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ప్రతి మండలంలో ఒక పాఠశాల ఉంది. ఈఎంఆర్‌ పాఠశాలల్లో కో-ఎడ్యుకేషన్‌, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన జరుగుతున్నది. సువిశాలమైన 30 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంఆర్‌ పాఠశాలలను నిర్మించారు. ఆరో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందుతుంది.

ఒక్కొ తరగతిలో 60 సీట్లు

ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలల్లో ఒక్కొక్క తరగతిలో 60 సీట్లు ఉంటాయి. ఇందులో 30 సీట్లు బాలికలు, మరో 30 సీట్లు బాలురకు కేటాయించారు. ఈ సీట్లలో 48 సీట్లు గిరిజన బాలబాలికలకు కేటాయించారు. పీవీటీజీలకు 3, దివ్యాంగులు, సంచార కుటుంబాల పిల్లలకు 3, తీవ్రవాద దాడులు, కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిలల్లకు 6సీట్లు కేటాయించారు. ఈ ఆరు సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాల విద్యార్థులకు కేటాయించారు.

ఫిబ్రవరి 28 దరఖాస్తుకు తుది గడువు

ఏకలవ్య పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ఫిబ్రవరి 28 తేదీ తుది గడువు. ప్రస్తుతం ఐదో తరగతిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాభ్యాసం చేస్తూ మార్చి 31కి 10-13ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. తెల్ల రేషన్‌ కార్డు కలిగి వార్షిక ఆదాయం రూ.లక్ష మించని కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రవేశాలకు అర్హులు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.50 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటో, సంతకం ఆప్‌లోడ్‌ చేయాల్సివుంటుంది. అలాగే దరఖాస్తు నమూనాలో తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్‌, కులం, నివాస స్థలం, రేషన్‌కార్డు ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రర్‌ నంబర్లు నమోదు చేయాల్సివుంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ అవుట్‌ని సమీపంలోనున్న ఈఎంఆర్‌ పాఠశాలకు అందజేయాలి. ఏప్రిల్‌ 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రతి మండలంలో ఉన్న ఈఎంఆర్‌, గురుకుల కళాశాల, పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

ప్రవేశ పరీక్ష సిలబస్‌..

ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతి సిలబస్‌పై పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్‌ ఎబిలిటీ(మానసిక సామర్థ్యం) 50 మార్కులు, అర్థమేటిక్‌(అంకగణితం) 25 మార్కులు, తెలుగు భాషపై 25 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

నాణ్యమైన విద్యాబోధన..

ఈఎంఆర్‌ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. పీజీ, బీఈడీ, టెట్‌, సీటెట్‌ అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. పాఠశాల స్థాయి ఆధారంగా 20 నుంచి 30మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

సదుపాయాలు..

ఈఎంఆర్‌ పాఠశాలలో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయంలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తరగతిలో కూర్చోవడానికి వ్యక్తిగత కుర్చీలు ఉంటాయి. వసతి గృహాల్లో పడుకునేందుకు బెడ్స్‌ ఉన్నాయి. శాశ్వత భవనాలు అందుబాటులోనున్న పాఠశాలల్లో నలుగురు విద్యార్థినీ, విద్యార్థులకు ఒక గది కేటాయించారు. సువిశాలమైన తరగతి గదులు, క్రీడామైదానం అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన పోషకాహారం కలిగిన మెనూ అమలుపరుస్తున్నారు. పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫాం, బెడ్‌షీట్‌, రగ్గులు, ప్లేట్‌, గ్లాస్‌, షూ, టై, పెట్టె ఉచితంగా అందజేస్తారు. బాలబాలికలకు రక్షణగా ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు పాఠశాలలను సంప్రదించవచ్చు

ఎంవీ రమణ, ప్రిన్సిపాల్‌, ఈఎంఆర్‌ఎస్‌, గూడెంకొత్తవీధి

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు సమీపంలోనున్న ఈఎంఆర్‌ పాఠశాలను తల్లిదండ్రులు సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, విద్యార్థి సంతకంతో ఈఎంఆర్‌ పాఠశాలకు వస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు చేస్తాం. ప్రైవేటు ఇంటర్నెట్‌ సెంటర్లతోనూ ఏపీటీడబ్యూగురుకులం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తును కచ్చితంగా సమీపంలోనున్న ఈఎంఆర్‌ పాఠశాలకు అందజేయాల్సివుంటుంది.

Updated Date - Feb 06 , 2026 | 10:56 PM