గుడ్డు ధర పైపైకి..
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:16 AM
దేశంలో తీవ్ర వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో ప్రభావం పౌలీ్ట్ర రంగంపైనా పడింది.
నేటి హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్లు రూ.670
వేడి వాతావరణంతో పెరగని ఉత్పత్తి
మార్కెట్ అవసరాలకు సరిపడా లేకపోవడంతో రేటు పెరుగుదల
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
దేశంలో తీవ్ర వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో ప్రభావం పౌలీ్ట్ర రంగంపైనా పడింది. వేసవి ముగిసినా ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతుండడంతో కోడి గుడ్లు ఉత్పత్తి ఇంకా పుంజుకోలేదు. మార్కెట్ డిమాండ్‌లో సుమారు 70 శాతం మేర గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో రేటు పెరుగుతూనే ఉంది. ఐదారు రోజుల క్రితం 100 గుడ్లు ధర రూ.640 ఉండగా, ఆ తరువాత రోజుకు రూ.10 వంతున పెరుగుతూ వస్తోంది. శనివారం మార్కెట్‌లో 100 గుడ్ల ధర రూ.670గా నిర్ణయించడం జరిగింది. అంటే రైతుబజార్లలో రూ.7కు విక్రయించే అవకాశం ఉంది. బయట మార్కెటలో ఇప్పటికే రూ.7.50 నుంచి రూ.8కు అమ్ముతున్నారు.
తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఈ ఏడాది పౌలీ్ట్ర రంగంపై ప్రభావం చూపాయి. ప్రతి ఫారంలో వేల కోళ్లు చనిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొనడంతో గత నెలలో గుడ్డు ధర పెరిగింది. అయితే జూన్‌లో కొద్దిగా వేడి తగ్గడంతో ఉత్పత్తి పెరిగింది. దీంతో ధరలు కొంతమేర తగ్గాయి. కానీ, మార్కెట్ అవసరాలకు సరిపడా మాత్రం ఉత్పత్తి కాలేదు. ఇటువంటి తరుణంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు మళ్లీ కొనసాగుతుండడంతో సాధారణ ఉత్పత్తిలో 70 శాతం మేర మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్టు నెక్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడ్లు రేట్లు పెరిగాయని చెబుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గుడ్డు రేటు పెరిగిందని, కోస్తాలో వారం నుంచి క్రమేపీ పెరుగుతుందని వ్యాపారులు అంటున్నారు. వాతావరణం చల్లబడకపోతే గుడ్లు ఉత్పత్తి పెరగదని, అప్పుడు రేటు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నగరంలో పెద్ద వ్యాపారి ఒకరు వ్యాఖ్యానించారు.
అదానీ ఫౌండేషన్‌కు 60.29 ఎకరాలు
కాపులుప్పాడలో ప్రీమియర్ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఏర్పాటు
కణమాంలో లాజిస్టిక్స్ పార్కుకు 91.38 ఎకరాలు
మేహాద్రి గురుకులంలో ఐఐటీ, నీట్ శిక్షణ
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం తీసుకున్న నిర్ణయాల్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పలు అంశాలు ఉన్నాయి. మేహాద్రిగెడ్డలోని గురుకులంలో సొసైటీ ద్వారా విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు ఇంటెన్సివ్, రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనివల్ల జిల్లాలో వందలాది మంది విద్యార్థులకు మేలు జరగనుంది. కాపులుప్పాడలో ప్రీమియర్ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు అదానీ ఫౌండేషన్ గ్రూపునకు 60.20 ఎకరాలు ఉన్నత విద్యా శాఖ ద్వారా కేటాయింపునకు ఆమోదం లభించింది. ఎకరాకు రూ.15 లక్షల రాయితీ ధరతో భూమి కేటాయించారు. ఇది రిజిస్ట్రార్ విలువపైనా లేదంటే మార్కెట్ రేటుపైనా అనే విషయంలో స్పష్టత లేదు.
- ఆనందపురం మండలం కణమాంలో లాజిస్టిక్స్, లైట్ ఇండస్ర్టియల్ పార్కు ఏర్పాటు కోసం ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ అసెట్ 4 అనే ప్రైవేటు సంస్థకు ఎకరా రూ.55 లక్షల చొప్పున 91.38 ఎకరాలు కేటాయించారు.
- విశాఖలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కేసుల విచారణ కోసం కేంద్రం ఏర్పాటు చేస్తున్న జిల్లా అండ్ సెషన్స్ జడ్జి కోర్టుకు అవసరమైన 16 పోస్టుల భర్తీకి అనుమతించింది.
ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగాల పేరుతో కలెక్షన్
కో-ఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయంటూ నిరుద్యోగులకు దళారుల వల
రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు వసూలు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్‌లో కో-ఆర్డినేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద కొందరు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.30 వేల వరకు వేతనం, ఇతర అలవెన్సులు వస్తాయని సదరు దళారులు నమ్మిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల పర్యవేక్షణ, కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం వంటి బాధ్యతలను కో-ఆర్డినేటర్లు నిర్వర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కో-ఆర్డినేటర్ల పాత్ర కీలకం కాబట్టి అదనపు ఆదాయం కూడా లభిస్తుందని ఆశ చూపిస్తున్నారు. వేతనంతోపాటు లబ్ధిదారుల ఎంపిక కూడా తమ చేతిలోనే ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు ఎగబడుతున్నారు. కాగా, కొందరు ఇందుకు సంబంధించి సమాచారం కోసం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఫోన్‌లు వస్తున్నాయి. అయితే, అటువంటి పోస్టులేవీ భర్తీ చేయడం లేదని, అదంతా ఫేక్ ప్రచారమంటూ సమాధానమిస్తున్నారు. అయితే, దీనిపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు బహిరంగ ప్రకటన విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు మోసపోతున్నారు.