గుడ్డు కూర.. కుళ్లిన వాసన
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:38 AM
కోడి గుడ్డు కూర కుళ్లిన వాసన వస్తోందంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల హాస్టల్ (ఏ1) విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.
ఏయూ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆందోళన
నాసిరకం ఆహారం వడ్డించడంపై ఆగ్రహం
నాణ్యతలో రాజీ లేకుండా చూస్తామని ప్రిన్సిపాల్ హామీ
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
కోడి గుడ్డు కూర కుళ్లిన వాసన వస్తోందంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల హాస్టల్ (ఏ1) విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనానికి వచ్చిన కొందరు విద్యార్థులు కూర వాసన వస్తున్నట్టు గుర్తించారు. కుళ్లిపోయిన గుడ్లు, టమాటాలు, నాసిరకం కూరగాయలు వినియోగించడం వల్లే వాసన వస్తోందని నిరసన వ్యక్తంచేశారు. కూర వండిన గిన్నెను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరికొందరు విద్యార్థులు వీసీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రతినెలా నిర్ణీత సమయంలో మెస్ చార్జీలు చెల్లిస్తున్నామని, అయినప్పటికీ నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాలాది రవి, వార్డెన్, ఇతర అధికారులు మెస్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని చెప్పడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం విశ్వవిద్యాలయం బాధ్యత అని పేర్కొన్నారు. దీనిపై ప్రిన్సిపాల్ జాలాది రవి మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులతో మాట్లాడామన్నారు. కర్రీ నుంచి వాసన రావడానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నామని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని ఆదేశించినట్టు తెలిపారు.
శిక్షణతో సరి!
ఇంకా అందని కుట్టు మిషన్లు
మహిళల ఎదురుచూపులు
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1,539 మందికి శిక్షణ
మిషన్లు, కిట్లు ఉచితంగా ఇస్తామన్న అధికారులు
నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై అసంతృప్తి
ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు
ఉన్నతాధికారులకు ఎమ్మెల్యేల ఫోన్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కుట్టు శిక్షణ పొంది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ అధికారులు మిషన్లు పంపిణీ చేయకపోవడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం గత ఏడాది కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో సుమారు మూడు వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు అనంతరం ఉచితంగా కుట్టు మిషన్, కిట్ అందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తొలి విడతలో శిక్షణకు 1,539 మంది (బీసీ కార్పొరేషన్ పరిధిలో 1,367 మంది, కాపు కార్పొరేషన్ నుంచి 94 మంది, ఈబీసీ కార్పొరేషన్ నుంచి ఆరుగురు, కమ్మ కార్పొరేషన్ నుంచి ఇద్దరు, రెడ్డి కార్పొరేషన్ నుంచి 31 మంది, ఆర్యవైశ్య కార్పొరేషన్ నుంచి 20 మంది, క్షత్రియ కార్పొరేషన్ నుంచి తొమ్మిది మంది, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పది మంది మహిళలు) మహిళలను ఎంపిక చేశారు. వారికి ఏడు నియోజకవర్గాల పరిధిలో 27 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్కిల్ అసెస్‌మెంట్ టెస్ట్‌ను నిర్వహించింది. శిక్షణ అనంతరం రూ.6,199 విలువైన మిషన్ అందిస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పటివరకూ మిషన్లు పంపిణీ చేయలేదు. దాంతో శిక్షణ పొందిన మహిళలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ ఉపాధి పొందవచ్చుననే ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి 90 రోజులపాటు శిక్షణ పొందామని చెబుతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా మిషన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు స్థానిక ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో జిల్లాలోని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేసి వెంటనే కుట్టు మిషన్లు పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించినట్టు చెబుతున్నారు.
కొద్దిరోజుల్లో మిషన్లు పంపిణీకి చర్యలు
శంకరరావు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్
శిక్షణకు హాజరైన ప్రతి మహిళకు కుట్టు మిషన్ అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కొద్దిరోజుల్లో మిషన్లు అందిస్తాం. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరిగింది. శిక్షణకు ముందు చెప్పినట్టుగానే అసెస్‌మెంట్ పూర్తిచేసిన ప్రతి ఒక్కరికీ రెండు, మూడు వారాల్లో మిషన్లు అందిస్తాం. దీనికి సంబంధించిన వివరాలను కొద్దిరోజుల్లో వెల్లడిస్తాం.