గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:44 PM
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఎస్‌ఆర్.శంకరన్ ఆడిటోరియం ప్రారంభం
పాడేరురూరల్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం చింతలవీధిలో ఎస్‌సీఏ నిధులు రూ. 1.5 కోట్లతో నిర్మించిన ఎస్‌ఆర్.శంకరన్ ఆడిటోరియాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన బిడ్డల ఉపాధి, సంక్షేమం కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి ఎస్‌ఆర్.శంకరన్ అని అన్నారు. ఆయన పేరుతో ఈ ఆడిటోరియం నిర్మించడం గర్వకారణమన్నారు. అల్లూరి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేసేందుకు యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ, అంతర్ పంటలు, కాఫీ, మిరియాల పంట వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామానికి రోడ్డు, మంచి నీటి ఏర్పాట్లు చేస్తూ.. డోలీ మోత రహిత జిల్లాగా రూపుదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్ కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె.సాహిత్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్ది ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, ఎంపీపీ సొనారి రత్నకుమారి, చింతలవీధి సర్పంచ్ వంతాల సీతమ్మ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, టీడబ్ల్యూ ఈఈ డేవిడ్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.