మన్యంలో విద్యాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:16 PM
గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి అధికారులు, ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు.
అధికారులు, ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం
ఇకపై తరచూ ఆశ్రమాల్లో తనిఖీలుంటాయని వెల్లడి
పాడేరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి అధికారులు, ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో గిరిజన సంక్షేమ విద్యాశాఖాధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాళ్లతో మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని ఉపాధ్యాయుల హాజరు, వాటి నిర్వహణపై హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో పాటు పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. బోధన, విద్యార్థుల పఠనాసక్తిని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వంట గదులు, తాగునీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి, విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఉపాధ్యాయులు విధిగా సమయ పాలన పాటించాలని, ఇకపై తాను విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. టీచర్ల సర్వీసుకు సంబంధించిన పెండింగ్ సమస్యలుంటే తక్షణమే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే పరిమిళ, గురుకులం సెల్ కన్వీనర్ మూర్తి, ఐటీడీఏ పరిధిలోని ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.