Share News

భూ విలువల పెంపుపై కసరత్తు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:45 AM

భూముల మార్కెట్‌ విలువల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.

భూ విలువల పెంపుపై కసరత్తు

నివేదికలు సిద్ధం చేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లు

నేడు కమిటీ ముందుకు ప్రతిపాదనలు

రేపటి నుంచి అభ్యంతరాల స్వీకారం

విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

భూముల మార్కెట్‌ విలువల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. తొలుత ఫిబ్రవరి ఒకటో తేదీ విలువలు పెంచాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతి తక్కువ వ్యవధిలో ఎలా అని రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తలలు పట్టుకుంటే ఎలా చేయాలి?, ఎప్పుడు చేయాలో...సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా ప్రాంతాలపై సబ్‌ రిజిస్ట్రార్లకు పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎంత పెంచాలో నివేదిక రూపొందించి 24వ తేదీన అంటే శనివారం జిల్లా కమిటీకి సమర్పించాలని సూచించింది. అక్కడ చర్చించాక ఆయా విలువలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లోను, వెబ్‌సైట్‌లోను ఉంచి ఆదివారం (25వ తేదీ) నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని పేర్కొంది. ఆ తరువాత ఆ విలువను డేటా ఎంట్రీ చేసి, చెక్‌ లిస్ట్‌ కోసం, వెరిఫికేషన్‌ కోసం అందుబాటులో ఉంచాలని సూచించింది. 29వ తేదీతో అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకారం పూర్తిచేసి 30వ తేదీన వాటిపై చర్చించాలని పేర్కొంది. 31వ తేదీన కమిటీ ముందు కూర్చొని విలువలు ఖరారు చేసి, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విశాఖ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్లు అంతా విలువలు పెంచుతూ శనివారం జరిగే కమిటీ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించామని విశాఖ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jan 24 , 2026 | 12:45 AM