మిరియాలపై అతి వర్షాల ప్రభావం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:15 AM
గతేడాది కురిసిన అతి వర్షాలు మన్యంలోని మిరియాల పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. దీని వలన మిరియాల పంట సుమారుగా మూడు వంతులు దిగుబడి తగ్గిపోయింది.
60 శాతం వరకు తగ్గిన దిగుబడి
ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడి తగ్గడంతో రైతులు దిగాలు
ఏజెన్సీ వ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో పంట ఉంటుందని అంచనా
సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.650 నుంచి రూ.700కు కొనుగోలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గతేడాది కురిసిన అతి వర్షాలు మన్యంలోని మిరియాల పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. దీని వలన మిరియాల పంట సుమారుగా మూడు వంతులు దిగుబడి తగ్గిపోయింది. ధర అశాజనకంగా ఉన్నా ఆశించిన దిగుబడి లేకపోవడంతో గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు.
మన్యంలో కాఫీ తోటలకు నీడనిచ్చేందుకు పొడుగ్గా ఉండే సిల్వర్ ఓక్ చెట్లకు మిరియాలు పాదులు అల్లుకుంటాయి. దీంతో కాఫీ తోటల్లో అంతర పంటగా ఎటువంటి అధిక పెట్టుబడి లేకుండా మిరియాలు నుంచి గిరి రైతులకు అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలుంటే, వాటిలో సుమారుగా 70 వేల ఎకరాల్లోని తోటల్లో మిరియాల పాదాలున్నాయని ఒక అంచనా. ఒక ఎకరం కాఫీ తోటల్లోని మిరియాల దిగుబడి ద్వారా గిరిజన రైతులకు ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో కాఫీ తోటలున్న గిరిజన రైతులు మిరియాల పాదుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అదనపు ఆదాయానికి కృషి చేస్తున్నారు.
2025లో అతి వర్షాలతో అనర్థం
గతేడాది ఏజెన్సీలో ఊహించని విధంగా వర్షాలు కొనసాగాయి. ఆఖరికి మండే వేసవి అయిన ఏప్రిల్ నెలలో సైతం వర్షాలు పడ్డాయి. దాదాపుగా ఏప్రిల్ మొదలుకుని నవంబరు వరకు సాధారణ వర్షాలతో పాటు అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో నిత్యం వర్షాలు కురవడంతో మిరియాల పంటకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి మిరియాలకు వర్షంతో పాటు ఎండ సైతం ఎంతో ముఖ్యం. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా 2025లో ఏడాదిలో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నెలలు వర్షాలు కురిశాయి. దీంతో మిరియాల దిగుబడిని దెబ్బతీశాయి.
జోరుగా మిరియాల క్రయవిక్రయాలు
ప్రస్తుతం మన్యంలో మిరియాల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పలు చోట్ల రైతులు చెట్లకున్న పాదుల నుంచి మిరియాలను సేకరిస్తుండగా, వారపు సంతల్లో మరికొందరు వాటిని విక్రయిస్తున్నారు. అలాగే తమకు పరిచయం ఉన్న వర్తకుల వద్దకే మిరియాలు తీసుకుని వచ్చి రైతులు విక్రయిస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన మిరియాలను వర్తకులు దేశీయ మార్కెట్‌లున్న భువనేశ్వర్, కటక్, కర్ణాటక, కోల్‌కత్తాకు తరలిస్తుంటారు. దిగుబడి తగ్గడంతో మరో మూడు వారాలు మాత్రమే మిరియాలు క్రయవిక్రయాలు జరుగుతాయని వర్తకులు అంటున్నారు. ఏజెన్సీలో మూడేళ్లుగా మిరియాలు కొనుగోలు ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత వారం నుంచి కొనుగోలు సీజన్ ప్రారంభంలోనే రూ.650 చొప్పున విక్రయాలు మొదలు కాగా, సోమవారం పెదబయలు, శనివారం హుకుంపేట వారపు సంతల్లో కిలో రూ.650 నుంచి రూ.700 చొప్పున రైతుల నుంచి వర్తకులు కొనుగోలు చేశారు. వాస్తవానికి జనవరి నెలాఖరు నుంచే మిరియాలు కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉండగా, కాఫీ క్రయవిక్రయాలు ఆలస్యం కావడంతో ఫిబ్రవరి మూడో వారం నుంచి మిరియాల కొనుగోలు మొదలయ్యాయి. అయితే గతేడాది ముగింపు ధర రూ.570 కాగా, పస్తుతం రూ.680 నుంచి రూ. 700 ఉన్న ధర క్రమంగా పెరిగే అవకాశముందని రైతులు, వర్తకులు అంటున్నారు.
ఏజెన్సీలో గత నాలుగేళ్లుగా మిరియాల ధరలు
వ.సం. సంవత్సరం సీజన్‌లో ప్రారంభ, ముగింపు ధర(కిలోకు)
1. 2023 రూ.400 నుంచి రూ.450
2. 2024 రూ.510 నుంచి రూ.550
3. 2025 రూ.550 నుంచి రూ.570
4. 2026 రూ.650 నుంచి రూ.700