గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:20 AM
గురుకులాల్లో విద్యాప్రమాణాలను పెంచడానికి ఉపాధ్యాయులు మరింతగా కృషి చేయాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సీఏ మణికుమార్ ఆదేశించారు. అకడమిక్ కార్యకలాపాలపై హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని ఆదేశించారు. శనివారం అల్లూరి జిల్లాలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ గురుకుల పాఠశాలలతో పాటు ఏకలవ్య మోడల్ పాఠశాలలను ఆయన సందర్శించారు.
గురుకుల సొసైటీ కార్యదర్శి మణికుమార్ ఆదేశం
పలు గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు సందర్శన
విద్యార్థుల విద్యా సామర్థ్యాల పరిశీలన
లోపాలపై హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు
పలు సూచనలు చేసిన కార్యదర్శి
అరకులోయ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో విద్యాప్రమాణాలను పెంచడానికి ఉపాధ్యాయులు మరింతగా కృషి చేయాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సీఏ మణికుమార్ ఆదేశించారు. అకడమిక్ కార్యకలాపాలపై హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని ఆదేశించారు. శనివారం అల్లూరి జిల్లాలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ గురుకుల పాఠశాలలతో పాటు ఏకలవ్య మోడల్ పాఠశాలలను ఆయన సందర్శించారు. డుంబ్రిగుడ, అరకులోయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు అరకులోయ బాలికల గిరిజన గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలను కార్యదర్శి సందర్శించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతి గురుకులంలో తానే స్వయంగా విద్యార్థులకు లెక్కలు, సైన్స్ బోధించారు. ఆయా సబ్జెకుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా తన పరిశీలనలో గుర్తించిన లోపాలపై ఉపాధ్యాయులకు వివరణ అడుగుతూ.. పలు సూచనలు చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు కూడా సాధారణ గణిత సమస్యలను పరిష్కరించలేకపోయారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు భౌతికశాస్త్రంలో బట్టీ పెట్టకుండా అవగాహనతో కూడిన విషయ సంగ్రహణను పెంపొందించుకునేలా తగిన శిక్షణ ఇవ్వాలని గురుకుల కార్యదర్శి మణికుమార్ ఆదేశించారు. స్టడీ అవర్స్‌లో లెక్కలు సబ్జెక్టుపై వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలని ఉపాధ్యాయులకు దిశా నిర్ధేశం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై రాబోయే రెండు నెలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఆయన వెంట టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమళ, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.