Share News

వెల్ఫేర్‌పై ఈడీ నజర్‌

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:12 AM

నగరానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌కు చెందిన ‘వెల్ఫేర్‌’ సంస్థపై ఒడిశాలోని భువనేశ్వర్‌ బ్రాంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కేసు నమోదుచేయడం, ఎండీ, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరపడం ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చర్చనీయాంశంగా మారింది.

వెల్ఫేర్‌పై ఈడీ నజర్‌

ప్రజల నుంచి రూ.రెండు వేల కోట్లు సేకరించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అంచనా

ఇళ్ల స్థలాల పేరుతో భారీగా వసూళ్లు

పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు

మూడేళ్ల కిందట ఎండీ మళ్ల విజయప్రసాద్‌ను అరెస్టు చేసిన జార్ఖండ్‌కు చెందిన సీఐడీ అధికారులు

తాజాగా ఒడిశా సీఐడీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ

రూ.1.01 కోట్లు నగదు, నాలుగు విలాసవంతమైన కార్లు సీజ్‌

182 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌

చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న బాధితులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌కు చెందిన ‘వెల్ఫేర్‌’ సంస్థపై ఒడిశాలోని భువనేశ్వర్‌ బ్రాంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కేసు నమోదుచేయడం, ఎండీ, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరపడం ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చర్చనీయాంశంగా మారింది. భూముల క్రయవిక్రయ లావాదేవీలతో ప్రారంభమైన వెల్ఫేర్‌ సంస్థ అనంతరం రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌, టూరిజం రంగాలకు వ్యాపారాన్ని విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌, జార్ఖండ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బ్రాంచీలను ఏర్పాటుచేసి ప్రజల నుంచి డబ్బులు సేకరించింది. అయితే వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో సంస్థపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

వైసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ 2002 ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. వెల్ఫేర్‌ పేరుతో భూములు కొనుగోలు చేయడం, విక్రయించడం చేసేవారు. ఆ తరువాత అధిక వడ్డీలు ఆశ చూపి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్టు, ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ నెలవారీ స్కీమ్‌ల పేరుతో రూ.వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి చెల్లింపులు సక్రమంగా జరగడంతో చాలామంది అప్పులు చేసి మరీ సంస్థలో డబ్బులు పెట్టారు. వ్యాపారం బాగా జరగడంతో ఉమ్మడి ఏపీలోని పలు ప్రధాన నగరాలు, చిన్న పట్టణాల్లో బ్రాంచీలను ఏర్పాటుచేశారు. ఆ తరువాత ఒడిశా, బిహార్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా కార్యాలయాలు తెరిచి డిపాజిట్లు సేకరించారు. అయితే డిపాజిట్‌దారులకు కాల పరిమితి దాటినాసరే తిరిగి చెల్లించకపోవడం, అలాగే నెలవారీ స్కీమ్‌ కింద పెట్టుబడి పెట్టిన వారికి స్థలాలను అప్పగించకపోవడంతో ఖాతాదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో వెల్ఫేర్‌ గ్రూపుపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి.

వెల్ఫేర్‌ కార్యాలయం వద్ద తరచూ ఆందోళనలు

వెల్ఫేర్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టినవారు, డిపాజిట్లు కట్టినవారు తమకు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆశీల్‌మెట్టలోని ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు. అక్కడ సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడం, సంస్థ ఎండీ విజయప్రసాద్‌ అందుబాటులో ఉండకపోవడంతో కార్యాలయం ముందు ఆందోళనకు దిగేవారు. త్రీటౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసేవారు. చివరకు జార్ఖండ్‌కు చెందిన బాధితులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించడంతో సీఐడీ, సీబీఐ అధికారులు మూడేళ్ల కిందట మళ్ల విజయ్‌ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఆయన కొన్ని నెలలు జైలులో ఉండి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌ బ్రాంచి ఈడీ అధికారులు మళ్ల విజయ్‌ప్రసాద్‌పై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) 2002లోని సెక్షన్‌ 17తో పాటు డిపాజిటర్స్‌ యాక్ట్‌ ఉల్లంఘనలు కింద కింద ఈనెల ఐదో తేదీన సోదాలు చేశారు. ఈ సందర్భంగా రూ.1.01 కోట్ల నగదు, పలు స్థిర,చర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నేరపూరిత అంశాలను సూచించే కొన్ని పత్రాలు, మొబైల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 182 బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని ఫ్రీజింగ్‌ చేసి, ఆరు విలాసవంతమైన కార్లు సీజ్‌ చేశారు.

మళ్ల విజయప్రసాద్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదుకావడంతో 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 01:12 AM