ఈ- పంట నమోదు ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:49 PM
రైతులకు మేలు చేసే ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి జిల్లాలో ఈ-పంట నమోదుపై వ్యవసాయానుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
- అధికారులకు కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
- కాఫీ సాగును పూర్తిస్థాయిలో ఈ- పంటలో చేర్చాలని సూచన
పాడేరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు మేలు చేసే ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి జిల్లాలో ఈ-పంట నమోదుపై వ్యవసాయానుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలో సహజ పద్ధతులతో సాగవుతున్న పంటలను విధిగా ఈ-పంటలో నమోదు చేయాలన్నారు. గతం నుంచి ఈ-పంటలో నమోదవుతున్న పంటలతో పాటు సాగవుతున్న కాఫీ పంట మొత్తాన్ని ఈ- పంటలో నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రధానంగా కాఫీ పంటలను నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో కాఫీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ఒక డేటాబేస్ ఉంటుందన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి సాగు భూమిని విధిగా పరిశీలించి, ప్రతి పంటను కచ్చితంగా ఈ-పంటలో నమోదు చేయాలని, ఈ క్రమంలో ఏ పంటను విస్మరించవద్దని ఆమె సూచించారు. ఈ విషయంతో వ్యవసాయశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈ- పంట నమోదుపై జిల్లా అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తుంటారని, సెప్టెంబరు 15 నాటికి జిల్లాలో సాగవుతున్న అన్ని పంటలు ఈ- పంటలో నమోదు కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, కాఫీ ఏడీ కాఫీ సీనియర్ లైజన్ అధికారి ఎస్.రమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.