కణమాంలో ‘ఎకోబాక్స్’లాజిస్టిక్స్ పార్క్
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:48 AM
జిల్లాలోని ఆనందపురం మండలం కణమాం గ్రామంలో ‘ఎకోబాక్స్’ ఇండస్ట్రియల్ అసెట్ అనే సంస్థ లాజిస్టిక్స్ అండ్ లైట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేస్తోంది.
రూ.1,008 కోట్ల పెట్టుబడి
ఐదు వేల మందికి ఉపాధి
రూ.55 లక్షల చొప్పున 91.38 ఎకరాలు కేటాయింపు
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఆనందపురం మండలం కణమాం గ్రామంలో ‘ఎకోబాక్స్’ ఇండస్ట్రియల్ అసెట్ అనే సంస్థ లాజిస్టిక్స్ అండ్ లైట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూ.55 లక్షల చొప్పున 91.38 ఎకరాలు కేటాయించింది. అక్కడకు సమీపాన తర్లువాడలో ఏర్పాటుకానున్న గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ హబ్‌కు అవసరమైన లాజిస్టిక్స్ అవసరాలను ఈ సంస్థ తీరుస్తుంది. దశల వారీగా ఎకోబాక్స్ అక్కడ రూ.1,008 కోట్ల పెట్టుబడి పెట్టి సుమారు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
ఈ ఇండస్ట్రియల్ పార్కులో 44.65 ఎకరాల్లో 19.46 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. అందులో మూడు వేర్‌హౌస్ బ్లాకులు ఉంటాయి. ఒక బ్లాక్‌ను పరిపాలనా భవనం, మరో బ్లాకులో లైట్ తయారీ యూనిట్, ఇంకో బ్లాకులో డేటా సెంటర్ సంబంధిత వ్యవహారాల కోసం కేటాయించినట్టు ప్రభుత్వానికి సమర్పించిన బిల్డింగ్ ప్లాన్‌లో ఎకోబాక్స్ వివరించింది. విశాఖ జిల్లాలో వస్తున్న అతి పెద్ద టెక్నాలజీ లాజిస్టిక్ పార్క్ కావడంతో దీనికి అవసరమైన రవాణా సదుపాయం కోసం 24 మీటర్ల వెడల్పున మాస్టర్ ప్లాన్ రహదారి నిర్మించాలని వీఎంఆర్‌డీఏను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
మూడో దశలో ‘పంచాయతీ’ ఎన్నికలు
19న నోటిఫికేషన్, డిసెంబరు 2న పోలింగ్
జిల్లాలో 79 పంచాయతీలు, 802 వార్డులు
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. విశాఖ జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు మూడో దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈనెల 19న నోటిఫికేషన్ జారీకానున్నది. డిసెంబరు రెండో తేదీన ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 79 పంచాయతీలు, వాటి పరిధిలో 802 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,62,407 మంది ఓటర్లు (పురుషులు 79,630 మంది, మహిళలు 82,737 మంది) ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు వార్డుకొకటి చొప్పున 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఆనందపురం మండలంలో 26 పంచాయతీలు (226 వార్డులు), భీమిలి మండలంలో 16 పంచాయతీలు (166 వార్డులు), పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు (226 వార్డులు), పెందుర్తి మండలంలో 15 పంచాయతీలకు (150 వార్డులు) ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. అందుకు అవసరమైన సామగ్రి సిద్ధం చేశారు. పరిషత్ ఎన్నికలు ముగియడంతో పంచాయతీల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది.