నగరంలో భూకంపం
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:47 AM
నగరంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
ఆదివారం ఉదయం 5.05 గంటల సమయంలో కంపించిన భూమి
పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు
రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదు
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున ఐదు గంటలు ఐదు నిమిషాల సమయంలో పలు చోట్ల భూమి కంపించింది. స్వల్పంగానే ప్రకంపనలు రావడంతో చాలామందికి విషయం తెలియలేదు. అప్పటికే వాకింగ్‌తోపాటు ఇతర అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన వారికి పక్కన నుంచి భారీ లోడుతో లారీ వెళ్లినప్పుడు కలిగే ఫీలింగ్ (కంపనం) ఎదురయిందని తెలిపారు. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ఇళ్లలోని వస్తువులు కింద పడుతుంటాయి. అయితే ఆదివారం నాటి ప్రకంపనల్లో అలాంటివేవీ నమోదుకాలేదు. ఉదయం నిద్రలేచిన తరువాత కొందరు చెబితే తప్ప చాలా మందికి భూకంపం గురించి తెలియలేదు. భూకంపం వచ్చినట్టు వార్తలు చూసిన నగరవాసులు భయాందోళన చెందారు.
4.5 తీవ్రత
నగరంలో భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం విశాఖకు సుమారు 150 కిలోమీటర్లు దూరం, బంగాళాఖాతంలో పది కిలో మీటర్ల లోతున ఏర్పడినట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పెంటకోట త్రినాథరావు తెలిపారు. స్వల్ప భూకంపాలు మాత్రమే విశాఖలో వచ్చే అవకాశముందని, నష్ట తీవ్రతను కలిగించే భూకంపాలకు అవకాశం లేదని ఆయన వెల్లడించారు. తీవ్రమైన భూకంపాలు వచ్చేందుకు అవకాశం లేని సేఫెస్ట్ ప్రాంతం విశాఖ అని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ ప్రాంతాల్లో ప్రకంపనలు
నగర పరిధిలోని తాటిచెట్లపాలెం, మధురవాడ, పీఎంపాలెం, మద్దిలపాలెం, ఆరిలోవ, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, పెదవాల్తేరు, గోపాలపట్నం, గాజువాక, వేపగుంట, అక్కయ్యపాలెం, సింహాచలం తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రెండు నుంచి ఐదు సెకన్ల మధ్య మాత్రమే ప్రకంపనలు రావడం, అది కూడా స్వల్ప తీవ్రత కావడంతో ప్రజలకు తెలియలేదు. భూకంపం వచ్చినట్టు మీడియాలో కథనాలు వచ్చిన తరువాత ప్రజలు భయాందోళన చెందారు.
‘సన్’డే
పడమర గాలులతో వేడెక్కిన నగరం
మేఘాల జాడ లేక వేడి వాతావరణం
ఎయిర్‌పోర్టులో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఉక్కిరిబిక్కిరైన విశాఖ వాసులు
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
వర్షాలతో తడిసి మద్దవ్వాల్సిన సమయంలో నగరంలో ఎండ ఠారెత్తించింది. ఉదయం తొమ్మిది గంటలకే భానుడి ప్రతాపం ప్రారంభమై సాయంత్రం వరకు అదే రీతిలో కొనసాగింది. ఎక్కడా మేఘాల జాడ కనిపించలేదు.
ఉదయం నుంచి పడమరగాలులతో నగరం వేడెక్కింది. మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఉండేవారంతా ఠారెత్తిపోయారు. ఎండ వేడి తాళలేక నీడకు చేరారు. అవకాశం ఉన్న వారు ఏసీ సదుపాయం ఉండే మాల్స్, ఇతర షోరూమ్‌లను ఆశ్రయించారు. ఇళ్లల్లో ఉండేవారు ఏసీలు ఆన్‌చేసుకున్నారు. సాయంత్రానికి కూడా మేఘాలు ఆవరించకపోవడంతో నగరంలో వాతావరణం చల్లబడలేదు. ఆదివారం ఎండ తీవ్రతకు ఏసీల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. వర్షాకాలం ప్రారంభం తరువాత తగ్గిన విద్యుత్ డిమాండ్ ఆదివారం భారీగా పెరిగిందని ఈపీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఎంత విద్యుత్ వినియోగం జరిగిందో లెక్కలు చెప్పలేదు. ఇదిలా ఉండగా ఆదివారం ఎయిర్‌పోర్టులో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జూలైలో 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డుగా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండుమూడు రోజులు ఎండతీవ్రత కొనసాగి వేడిగాలుల ప్రభావం ఉంటుందన్నారు.