‘భోగాపురం’లో బాలారిష్టాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:21 AM
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి వేళ ఎవరైనా దిగితే బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
రాత్రి వేళ ఎయిర్పోర్టులో దిగితే బయటకురావడం ఒకింత ఇబ్బందిగా ఉందంటున్న ప్రయాణికులు
సూచిక బోర్డులు తక్కువ
సన్నని టోల్‌గేట్...భారీగా నిలిచిపోతున్న వాహనాలు
సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి
విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి వేళ ఎవరైనా దిగితే బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విమానాశ్రయం లోపల అవసరమైనన్ని సూచికలు (సైన్ బోర్డులు) ఏర్పాటుచేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే బయటకు వచ్చాక ట్యాక్సీ కోసం బుకింగ్ కౌంటర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోందంటున్నారు. ఇక సొంత కార్లలో ఎవరైనా విమానాశ్రయానికి వెళితే...ఆ వాహనాలకు పార్కింగ్ దూరంగా ఇచ్చారు. అక్కడి నుంచి భారీ లగేజీతో విమానాశ్రయం లోపలకు వెళ్లడానికి ప్రయాణికులు చెమటోడ్చాల్సి వస్తోంది. అవసరమైనంత మంది పోర్టర్లు కూడా అందుబాటులో ఉండడం లేదు.
విమానాశ్రయాన్ని అందంగా, ఆధునికంగా, కళాత్మకంగా తీర్చిదిద్దారు గానీ ప్రయాణికులకు అవసరమైనవి సమకూర్చడంలో యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రాంగణంలోకి వాహనాలు వెళ్లడానికి ఏర్పాటుచేసిన టోల్‌గేట్ కూడా చాలా చిన్నదిగా ఉంది. దాంతో అక్కడ పీక్ టైమ్‌లో సుమారు 500 మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. శంషాబాద్‌లో అతి పెద్ద విమానాశ్రయం నిర్మించి, చక్కగా నిర్వహిస్తున్న జీఎంఆర్ యాజమాన్యం ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నదో అర్థం కావడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
విమానాశ్రయం నిర్వహణ లోపాలపై యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడడానికి పర్యాటక రంగానికి చెందిన పలువురు యత్నిస్తే అటు నుంచి ప్రతి స్పందన కనిపించడం లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్ పెడితే సమాధానం ఇవ్వకుండా చూసి మౌనంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
లండన్ విమానాశ్రయమే బాగుంది
భోగాపురం విమానాశ్రయం కంటే పది రెట్లు పెద్దదైన లండన్ విమానాశ్రయమే యూజర్ ఫ్రెండ్లీగా ఉందని టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంత చిన్న విమానాశ్రయమైనా ప్రయాణికులకు అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయని, విమానాశ్రయం నిర్వాహకులు కనీసం ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు.