Share News

ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్‌

ABN , Publish Date - May 13 , 2026 | 01:02 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్‌

విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 11 కేంద్రాల్లో మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం ఏడుగంటలు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులకు సహాయంగా వచ్చిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షలు ఈనెల 20వ తేదీ వరకు జరుగుతాయి.


ఉత్తీర్ణత తగ్గితే ఇంటికే!

జూనియర్‌ కళాశాలల్లో ఫలితాలపై ఇంటర్‌ విద్యాధికారి హెచ్చరిక

తక్కువ ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టు లెక్చరర్లకు క్లాస్‌

మద్దిలపాలెం, మే 12 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే అధ్యాపకులు ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి పి.ఉమారాణి హెచ్చరించారు. పిఠిపురంకాలనీ ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంగళవారం జిల్లాలో 50 శాతం లోపు ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, సబ్జెక్టు అఽధ్యాపకులతో ఆమె సమావేశం నిర్వహించి ఫలితాలపై సమీక్షించారు.

జిల్లాలోని తొమ్మిది జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 39.40 శాతం, ద్వితీయ సంవత్సరం 54.54 శాతం ఉత్తీర్ణత సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనందపురం, మల్కాపురం, మధురవాడ, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ, భీమిలి, పెందుర్తి, ఇస్లాంపేట, అగనంపూడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫలితాలు దారుణంగా ఉండడానికి కారణాలేంటని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఉత్తమ ఫలితాలు సాధించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇప్పటికే తక్కువ ఉత్తీర్ణత సాధించిన కళాశాలల అధ్యాపకులకు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నోటీసులు జారీచేశారని గుర్తుచేశారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత మెరుగుపడేలా విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు. వచ్చే ఏడాదికి ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకుని, అమలుచేయాలని సూచించారు. తరగతులను ప్రిన్సిపాల్స్‌ గమనించి, అధ్యాపకులకు సలహాలివ్వాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తరగతులకు గైర్హాజరు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌

జిల్లాలోని ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు పిఠాపురంకాలనీ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయానికి చేరాయి. ఇక్కడ నుంచి జూనియర్‌ కళాశాలలకు తరలించారు. సబ్జెక్టుల వారీగా ఆంగ్లం 1,770, తెలుగు 1,336, సంస్కృతం 213, హిందీ 202, ఉర్దూ 17, గణితం 554, ఫిజిక్స్‌ 911, కెమిస్ర్తీ 911, బయోలజీ 368, హిస్టరీ 220, ఎకానమిక్స్‌ 613, సివిక్స్‌ 384, కామర్స్‌ 617, అకౌంటెన్సీ 617 పాఠ్యపుస్తకాలు చేరాయి. వీటిని ఆయా కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. తెలుగు మాధ్యమం, ద్వితీయ, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు రెండో విడతలో పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు వస్తాయని ఇంటర్‌ బోర్డు అధికారులు వివరించారు.

Updated Date - May 13 , 2026 | 01:02 AM