ఎవరికి వారే..
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:48 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న చర్చలు సోమవారం రాత్రి వరకు ఒక కొలిక్కొ రాలేదు.
ఫొటో: టీడీపీ, జనసేన, బీజేపీ గుర్తులతో కలిపి ఉన్న సింబల్
------
కూటమిలో కొలిక్కిరాని సీట్లు సర్దుబాటు
జడ్పీటీసీల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కొరవడిన స్పష్టత
ఎడతెగని చర్చలు.. మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న చర్చలు సోమవారం రాత్రి వరకు ఒక కొలిక్కొ రాలేదు. దాదాపు సగం జడ్పీటీసీ స్థానాల్లో రెండు లేదా మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసి, ఆయా స్థానాలు తమకే కావాలని ఎవరికి వారు పట్టుబడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ తరపున నామినేషన్లు వేసిన ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు.. తమకే బీ ఫారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య ప్రధానంగా ఎలమంచిలి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికంగా వుంది. నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో ఈ సమస్య నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. ఈలోగా సీట్లను సర్దుబాటు చేసుకొని, అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయడంతోపాటు మిగిలిన వారిచేత నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయాల్సిన బాధ్యత మూడు పార్టీల జిల్లాస్థాయినేతలు, ఎమ్మెల్యేపైనే వుంది. కాగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయిస్తారని వార్తలు రావడంతో టీడీపీకి చెందిన ఆశావహులు డీలా పడ్డారు.
జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 290 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ నుంచి 100, జనసేన 57, బీజేపీ 21 చొప్పున మొత్త 178 నామినేషన్లు వున్నాయి. సగానికిపైగా మండలాల్లో కూటమిలోని టీడపీ, జనసేన, బీజేపీల నుంచి ఐదారుగురు నామినేషన్లు వేశారు. సీట్ల సర్దుబాటుపై జిల్లాను యూనిట్‌గా తీసుకొని నియోజకవర్గాల స్థాయిలో కేటాయించుకోవాలని భావించారు. కానీ కిందిస్థాయిలో నేతల నుంచి ఒత్తిళ్లు అధికంగా వుండడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కశింకోట జడ్పీటీసీ నుంచి బీజేపీ, అనకాపల్లి నుంచి టీడీపీ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. కశింకోటలో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేశారు. అనకాపల్లిలో టీడీపీతోపాటు జనసేన నుంచి ఇద్దరు నామినేషన్లు వేసినప్పటికీ ఎమ్మెల్యే కొణతాల ఆదేశాల మేరకు వీరు మంగళవారం నామినేషన్లను ఉపసంహరించుకుంటారని తెలిసింది.
నర్సీపట్నం నియోజకవర్గంలో గొలుగొండ మినహా మిగిలిన మూడు మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున నామినేషన్లు వేశారు. అయితే వీటిలో ఒక స్థానాన్ని తమకు ఇవ్వాలని జనసేన గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మినహా మిగిలిన మూడు కోటవురట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో ఇక్కడ సర్దుబాటు సాఫీగా సాగింది. వాస్తవంగా పాయకరావుపేట జడ్పీటీసీని కూడా టీడీపీకే ఖాయం చేశారు. అయితే తాజాగా ఎంపీ సీఎం రమేశ్.. ఈ స్థానాన్ని తమకు (బీజేపీ) కేటాయించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. దీనిపై మంగళవారం ఒక స్పష్టత వచ్చే అకాశం వుంది.
జిల్లాలో అత్యంత క్లిష్టంగా మారిన నియోజకవర్గం ఎలమంచిలి అని చెప్పుకోవాలి. నాలుగు మండలాల్లో ఒక్కదానిపైనా ఏకాభిప్రాయం రాలేదు. ఎలమంచిలిలో జనసేన, బీజేపీ,, రాంబిల్లిలో టీడీపీ, జనసేన, మునగపాకలో టీడీపీ, జనసేన, అచ్యుతాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున పలువురు నామినేషన్లు వేశారు. సోమవారం రాత్రి అచ్యుతాపురం మండలంలోని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నివాసంలో జరిగిన చర్చల్లో ఆయనతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, నాలుగు మండలాలకు చెందిన ముఖ్యనాయకుల పాల్గొన్నారు. ఎలమంచిలి, రాంబిల్లి జడ్పీటీసీలకు జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక మునగపాక, అచ్యుతాపురం జడ్పీటీసీలకు టీడీపీ పోటీ చేయాలని అనుకోగా.. అచ్యుతాపురం స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకు టీడీపీ నేతలు ససేమిరా అన్నారు. దీంతో సీట్ల సర్దుబాటులో ప్రతిష్ఠంభన నెలకొంది.
చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రావికమతం, రోలుగుంట మండలాలను టీడీపీ కేటాయించడం దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు. బుచ్చెయ్యపేట జడ్పీటీసీని తమకు కేటాయించాలని జనసేన పార్టీ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది. మరోవైపు చోడవరం తమకు ఇవ్వాలని బీజేపీ సైతం డిమాండ్ చేస్తున్నది. బుచ్చెయ్యపేటను జనసేనకు కేటాయిస్తే, చోడవరం స్థానాన్ని టీడీపీకి ఇచ్చేయాల్సిందేనని నియోజకవర్గం నేతలు స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది.
మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి, కె.కోటపాడు జడ్పీటీసీల నుంచి టీడీపీ పోటీ చేయడంపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చింది. చీడికాడలో టీడీపీలోనే ఇద్దరు, ముగ్గురు పట్టుబడుతున్నారు. ఇక మాడుగుల స్థానాన్ని తమకు ఇవ్వాలని జనసేన గట్టిగానే పట్టుబడుతున్నది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం మూడు గంటలతో గడువు ముగియనుండడంతో ఈలోగానే సీట్ల సర్దుబాటు సాఫీగా జరుగుతుందని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు
అధికారులకు జేసీ శౌర్యమాన్ పటేల్ దిశానిర్దేశం
చోడవరం, దేవరాపల్లి, మాడుగులలో పర్యటన
చోడవరం/ మాడుగుల/ దేవరాపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ సోమవారం చోడవరం, మాడుగుల, దేవరాపల్లిల్లో పర్యటించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలట్ బాక్సులను స్వీకరించడానికి, వాటిని భద్రపరచడానికి, తరువాత ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అనకాపల్లి ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు, డిప్యూటీ తహశీల్దార్ శేషు, ఎండీవో బీవీఎస్ రాజు, తదితరులు వున్నారు.
దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల కళాశాలలో బ్యాలట్ బాక్సులను భద్రపరడానికి స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. అఽధికారులు ఎంపిక చేసిన రెండు గదులను ఆయన పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సీఐ కె.కృష్ణ, ఎస్ఐ సత్యనారాయణలతో మాట్లాడారు. ఆయన వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంజుల వాణి, తహశీల్దార్ లక్ష్మీదేవి, తదితరులు వున్నారు.
మాడుగుల ఆర్సీఎం పాఠశాల భవనాలను జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పరిశీలించారు. మాడుగుల మండలానికి సంబంధించి స్ర్టాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపును దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించాలని తొలుత అనుకున్నామని, అయితే అనివార్య కారణాల వల్ల మాడుగుల ఆర్సీఎం పాఠశాలను ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జేసీ వెంట ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీవో కొంకి అప్పారావు, తదితరులు వున్నారు.