తరిగిపోతున్న రక్త నిల్వలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:43 AM
ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. వేసవిలో రక్తదానం చేయడానికి కొందరు ముందుకు రాకపోవడం, విద్యాలయాలకు సెలవులు కావడంతో విద్యార్థులు అందుబాటులో ఉండరని రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడంతో రక్త నిల్వలు అడుగంటు తున్నాయి. ఈ నెల వరకు ఇబ్బంది లేకపోయినప్పటికీ వచ్చే మూడు నెలలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- బ్లడ్ బ్యాంకుల్లో కొరత
- రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడమే కారణం
- రానున్న మూడు నెలల్లో గడ్డు పరిస్థితులు
నర్సీపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. వేసవిలో రక్తదానం చేయడానికి కొందరు ముందుకు రాకపోవడం, విద్యాలయాలకు సెలవులు కావడంతో విద్యార్థులు అందుబాటులో ఉండరని రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడంతో రక్త నిల్వలు అడుగంటు తున్నాయి. ఈ నెల వరకు ఇబ్బంది లేకపోయినప్పటికీ వచ్చే మూడు నెలలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఒకటి, నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఒకటి చొప్పున బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. కాగా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ముఖ్యమైన బ్లడ్ గ్రూప్‌ల నిల్వలు తరిగిపోతున్నాయి. వాస్తవానికి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు సంచార రక్త సేకరణ వాహనం ద్వారా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. వాటిని బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేసి వైద్యుల సిఫారసు మేరకు అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడతారు. గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, రక్తహీనత, సికిల్‌సెల్ ఎనేమియా, తలసీమియా బాధితులకు రక్తాన్ని అందజేస్తారు. బ్లడ్ బ్యాంకులో అన్ని రకాల గ్రూపులు అందుబాటులో ఉంటే గాని అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం సరఫరా చేయలేరు. ఏరియా ఆస్పత్రిలో బీ- పాజిటివ్, ఓ- పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఎక్కుగా ఉన్నాయి. మిగిలిన గ్రూపుల నిల్వలు తరిగిపోతున్నాయి. బ్లడ్ బ్యాంకు పరిధిలో సికిల్‌సెల్, తలసీమియా రోగులు 15 మంది ఉన్నారు. వీటికి క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.
నర్సీపట్నం ఏరియా ఆస్పతి బ్లడ్ బ్యాంకులో నిల్వలు ఇలా..
ప్రస్తుతం బ్లడ్ గ్రూపులు బీ- పాజిటివ్ 25, ఓ- పాజిటివ్ 16 యూనిట్లు ఉన్నాయి. బీ- నెగిటివ్ 4, ఏ- పాజిటివ్ 5, బి-నెగిటివ్ 4, ఓ- నెగిటివ్ 1, ఏబీ పాజిటివ్ 5 యూనిట్లు ఉన్నాయి. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రితో పాటు చింతపల్లి, కోటవురట్ల సీహెచ్‌సీల రోగులకు ఈ బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం సరఫరా చేస్తారు. ఓ- నెగిటివ్, ఏ- పాజిటివ్, ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు తక్కువగా ఉన్నాయి. ఈ నెలలో రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ బ్యాంకులో నిల్వ చేస్తే మే నెలలో ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో రానున్న రెండు నెలలు ఇబ్బంది పడక తప్పదు. గత ఏడాది ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు ద్వారా 1.123 మందికి రక్తం సరఫరా చేశారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 378 మంది రోగులకు అందజేశారు. ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు ఉచితంగా అందిస్తారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రి రోగులకు రూ.800 తీసుకొని అందజేస్తున్నారు.