సర్పా నదిలో డంపింగ్ యార్డు!
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:28 AM
మండలం మీదుగా ప్రవహించే సర్పా నదిని, మాకవరపాలెం, కొండలఅగ్రహారం పంచాయతీల అధికారులు డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. దీనిపై రైతులు, ఇతర వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాకవరపాలెం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మండలం మీదుగా ప్రవహించే సర్పా నదిని, మాకవరపాలెం, కొండలఅగ్రహారం పంచాయతీల అధికారులు డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. దీనిపై రైతులు, ఇతర వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావికమతం మండలంలోని కొండప్రాంతాల్లో పుట్టిన సర్పా నది రోలుగుంట మండలం మీదుగా మాకవరపాలెం మండలంలోకి ప్రవహించి వరహా నదిలో కలుస్తుంది. ఈ నదికి ఇరువైపులా వున్న మాకవరపాలెం, కొండలఅగ్రహారం గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలోకి రాకపోవడంతో వీధుల్లో సేకరించిన చెత్తను సర్పా నది గట్టుపక్కనే వేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు చెత్తాచెదారం కుళ్లిపోయి, కలుషిత నీరు నదిలోకి చేరుతున్నది. దీనికితోడు చెత్తకుప్పలు పెరిగిపోయినప్పుడు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పొగ వెలువడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా పంచాయతీ, జలవనరుల శాఖల అధికారులు స్పందించి, వరహా నదిలో చెత్తాచెదారం పడవేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.