కాలుష్య కాసారం.. ఉప్పరిగెడ్డ
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:13 AM
అచ్యుతాపురం, రాంబిల్లిల మండలాల పరిధిలోని ఫార్మా కంపెనీల నుంచి శుద్ధిచేయని వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో సమీపంలోని ఉప్పరి గెడ్డలో నీరు నల్లగా మారిపోయింది. ఇందులోని చేపలు మృత్యువాతపడ్డాయి. ఫార్మా వ్యర్థాలను గెడ్డలోకి విడుదలచేయడంపై చుట్టుపక్కల గ్రామాల రైతులు, పూడిమడక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో మేజర్ శారదా నది నుంచి ఉప్పరి గెడ్డ విడిపోయి కృష్ణంపాలెం, లాలంకోడూరు, ఎరకన్నపాలెం, చాటమెట్ట, పూడిమడక ఉప్పు గళ్లీల పక్కనుంచి ఉప్పుటేరులో కలుస్తుంది.
ఫార్మా వ్యర్థాలను బయటకు విడుదల చేస్తున్న కంపెనీలు
విషపూరితం అవుతున్న జలవనరులు
ఉప్పరి గెడ్డ, ఉప్పుటేరుల్లో చనిపోతున్న చేపలు
పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన
అచ్యుతాపురం/ రాంబిల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం, రాంబిల్లిల మండలాల పరిధిలోని ఫార్మా కంపెనీల నుంచి శుద్ధిచేయని వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో సమీపంలోని ఉప్పరి గెడ్డలో నీరు నల్లగా మారిపోయింది. ఇందులోని చేపలు మృత్యువాతపడ్డాయి. ఫార్మా వ్యర్థాలను గెడ్డలోకి విడుదలచేయడంపై చుట్టుపక్కల గ్రామాల రైతులు, పూడిమడక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో మేజర్ శారదా నది నుంచి ఉప్పరి గెడ్డ విడిపోయి కృష్ణంపాలెం, లాలంకోడూరు, ఎరకన్నపాలెం, చాటమెట్ట, పూడిమడక ఉప్పు గళ్లీల పక్కనుంచి ఉప్పుటేరులో కలుస్తుంది. ఉప్పగిగెడ్డ సమీపంలో పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలు వున్నాయి. ఉత్పత్తి సమయంలో విడుదల అయ్యే వ్యర్థజలాలను పూడి గ్రామం వద్ద నిర్మించిన ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో శుద్ధిచేసి, అనంతరంప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెరువుల్లోకి నీటిని పంపాలి. ఈ చెరువుల్లో పెంచే చేపలకు హాని కలగకపోతే అప్పుడు ఆ నీటిని సముద్రంలోకి విడుదల చేయాలి. కానీ ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ఇక్కడి రసాయన వ్యర్థాలను పరవాడ ఫార్మా సిటీలోని ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు పంపుతున్నారు. అయితే రవాణాతోపాటు ట్రీట్‌మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో కొన్ని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను నేరుగా ఉప్పరిగెడ్డలోకి విడుదల చేస్తున్నాయి. దీంతో గెడ్డ నీరంతా నల్లగా మారిపోయింది. కాలుష్యం కారణంగా ఇందులోని చేపలు చనిపోతున్నాయి. ఈ గెడ్డ నీరు పూడిమడక వద్ద ఉప్పుటేరులో కలుస్తుండడంతో అందులోని చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఉప్పరిగెడ్డలో నీరు తాగి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు.